డైరీ కలకలం.. బీజేపీ నేతలకు రూ.1800 కోట్ల ముడుపులు

 

లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప రూపంలో బీజేపీని విమర్శించడానికి కాంగ్రెస్ కి ఓ ఆయుధం దొరికింది. బీజేపీ అగ్రనేతలకు ఆయన రూ.1800 కోట్లు చెల్లించినట్టు యడ్యూరప్ప డైరీలో ఉందంటూ 'కారవాన్' మ్యాగజైన్ 'యెడ్డీ డైరీస్' పేరుతో ఓ కథనం ప్రచురించింది. కారవాన్ కథనం ప్రకారం.. డైరీలో యడ్యూరప్ప తన దస్తూరీతోనే ఈ చెల్లింపుల గురించి రాశారు.

డైరీలోని వివరాల ప్రకారం.. బీజేపీ సెంట్రల్ కమిటీకి యడ్యూరప్ప రూ.1,000 కోట్లు చెల్లించారు. అలాగే.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరికి చెరో రూ.150 కోట్లు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రూ.100 కోట్లు, బీజేపీ అగ్ర నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు చెరో రూ.50 కోట్లు ఇచ్చారు. గడ్కరి కుమారుడు పెళ్లికి కూడా రూ.10 కోట్లు యడ్యూరప్ప చెల్లించారు. ఇక 2008లో తన ప్రభుత్వానికి అవసరమైన మద్దతు ఇచ్చి సాయపడిన 8 మంది ఎమ్మెల్యేలకు డబ్బుతో పాటు మంత్రి పదవులు ఇచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్ల చొప్పున, ఒకరికి మాత్రం రూ.10 కోట్లు చెల్లించారు.

ఆగస్ట్ 2017లో కర్ణాటక కాంగ్రెస్ నేత డి కె శివకుమార్ పై ఆదాయపన్ను శాఖ దాడి చేసినపుడు ఈ డైరీని స్వాధీనం చేసుకుందని కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ చెల్లింపులు నిజంగా జరిగాయా లేదా అనేది స్పష్టంగా లేదు. ప్రతి పేజీ కాపీలో యెడ్యూరప్ప సంతకం ఉన్నట్టు కారవాన్ పేర్కొంది. ప్రస్తుతం ఈ కథనం రాజకీయవర్గాల్లో సంచలనమైంది.

యడ్యూరప్ప డైరీలో విషయాలంటూ 'కారవాన్' రిపోర్ట్ బయటపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. రూ.1,800 కోట్ల మేరకు బీజేపీ నేతలు ముడుపులు తీసుకున్నారో లేదో ప్రధాని మోదీ తక్షణం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి సూర్జేవాలా డిమాండ్ చేశారు. చెల్లింపులకు సంబంధించిన వివరాలతో ఉన్న డైరీని ఆదాయం పన్ను శాఖ దాడుల్లో సీజ్ చేసినట్టు కారవాన్ మ్యాగజైన్ రిపోర్ట్‌ పేర్కొందని, ప్రతి పేజీపైనా యడ్యూరప్ప సంతకం ఉందని అన్నారు. ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం బీజేపీ నేతలందరిపై కొత్తగా నియమించిన లోక్‌పాల్‌తో  విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.