TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెప్టెంబర్ 10కి.... ఆత్మహత్యకి లింకేంటి?

Published on: Sat Sep 10, 2016 4:44PM

సెప్లెంబర్ 10.... వాల్డ్ సుయిసైడ్ ప్రివెన్షన్ డే! ఇది కూడా వుందా అని ఆశ్చర్యపోతున్నారా? అప్ కోర్స్, వుంది! నిజానికి సంవత్సరం పొడవునా వచ్చే రకరకాల వింత, విచిత్ర దినాలు, దినోత్సవాల కంటే ఇది ఎంతో ముఖ్యమైంది! అవసరమైంది! అర్థవంతమైంది కూడా! భూమ్మీద ఆత్మహత్య చేసుకునేదెవరు? మనిషే! ఇంకెవరూ సుయిసైడ్ చేసుకోరు! కొన్ని క్రిములు, పురుగులు, జంతువులు ఆత్మహత్యకి పాల్పడతాయని కొందరు చెబుతున్నా... అది చాలా అరుదైన పరిణామం. కాని, మామూలుగా మనకంటే ఎంతో తక్కువ స్థాయి చైతన్యంలో వుండే నూటికి తొంభై తొమ్మిది శాతం జంతువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోవు! మనిషి మాత్రం ఆత్మహత్య చేసుకుంటాడు! ఇదే పెద్ద విషాదం... 


మనిషి చాలా తెలివైన వాడు. అదే అతని బలం, బలహీనత. తెలివి సరైన దారిలో ముందుకు పోతే రోబోలు మొదలు రాకెట్ల వరకూ ఎన్నిటికో ప్రాణం పోస్తాడు. కాని, అదే తెలివి ఒక్కమారు తప్పుదోవ పట్టిందంటే తన ప్రాణం తానే తీసుకుంటాడు! ఇంకా తెలివి వక్ర మార్గం పట్టిపోతే సాటి మనిషిదే ప్రాణం తీస్తాడు కూడా! ఇలా హత్యకి , ఆత్మహత్యకి పాల్పడే మరే జీవి భూమ్మీద లేదనే చెప్పాలి.... ఎందుకని మనిషి హత్యకి, ఆత్మహత్యకి పాల్పడతాడు? హత్య చేయాలంటే స్వార్థం కట్టలు తెంచుకోవాలి. ఆగ్రహం నరాలు తెంచుకోవాలి. ఇది కొంత క్లియరే. కాని, ఆత్మహత్య చాలా క్లిష్టమైంది. ఒక మనిషి బతకటానికే ఎప్పుడూ ఛస్తుంటాడు. ఎన్నో చేస్తుంటాడు. ఏదైనా చేస్తుంటాడు. కాని, ఒకానొక క్షణంలో అంతా వద్దనుకుని ఉరితాడుకి వేళ్లాడుతాడు. నిద్ర మాత్రలు మింగేస్తాడు. ఇదే ఆత్మహత్యలోని అయోమయం! 


ప్రకృతి ప్రతీ జీవికి బతకటం సహజంగా నేర్పిస్తుంది. చిన్న చీమ కూడా కాలి కింద పడితే నలిగిపోయి మళ్లీ తిరిగి లేచి కూర్చునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ్నుంచి ముందుకు వెళ్లిపోయి ప్రాణం దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. కాని, కొన్ని లక్షల చీమలకు సమానమైన మనిషి మాత్రం రకరకాలుగా ఆత్మహత్య చేసుకుంటాడు. రకరకాల కారణాలతో తనని తాను అంతం చేసుకుంటూ వుంటాడు! ఈ వైపరిత్యానికి కారణం మనిషిలో వున్న అపారమైన జ్ఞాపకశక్తి! ఇది విచిత్రంగా అనిపించినా నిజం! మనిషికి మతిమరుపు వుంటుంది. అది చాలా ఇబ్బందులకి కారణం. కాని, జ్ఞాపకం అంతకంటే ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అసలు మన సమస్యలన్నీ మన ఆలోచనలే కదా! గతం గురించిన మన జ్ఞాపకాలే మన అత్యధిక శాతం దుఃఖాలకి కారణం. ఎప్పుడైతే మనిషి తన జ్ఞాపకాన్ని జయించలేకపోతాడో, ఎప్పుడైతే జరిగిపోయిన దానినే తలుచుకుని తలుచుకుని కుమిలిపోతాడో డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ జీవించటం కంటే మరణం మేలనిపించేలా చేస్తుంది! ఇదే లాజికల్ గా మాట్లాడుకున్నప్పుడు మనిసి ఆత్మహత్యకి కారణం!

ప్రతీసారి మనిషి గతమే ఆత్మహత్యకి కారణం కాకపోవచ్చు. అప్పుడప్పుడూ భయం, భవిష్యత్ గురించి మనిషి ఊహించుకునే అర్థరహితమైన కల్పనలు... ఇవి కూడా ఆత్యహత్యే శరణ్యం అనిపించేలా చేస్తాయి. 
వాల్డ్ సుయిసైడ్ ప్రివెన్షన్ డే అయిన ఇవాళ్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే... ఆత్యహత్యకి ఏకైక పరిష్కారం దైర్యం. అది వుంటే ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు. అలాగే, ఆత్యహత్య చేసుకుంటారని మనకు అనుమానం వున్న వారికి కూడా ధైర్యం కల్పించటమే అత్యుత్తమం...