TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొవాగ్జిన్ వ్యాక్సిన్ పరిశీలనకు WHO ఆమోదం.. 

Published on: Thu Jun 17, 2021 4:38PM

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ కొవిడ్ వ్యాక్సిన్ పరిశీలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించింది. దేశీయ తయారీ సంస్థ కొవాగ్జిన్..  కరోనా వ్యాక్సిన్ అంతర్జాతీయ వినియోగం కోసం భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు గతంలో దరఖాస్తు చేసుకుంది.  తాజాగా ఈ దరఖాస్తు పరిశీలనకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొవాగ్జిన్ ను భారత్ లో వినియోగిస్తుండగా, ఇతర దేశాల్లో వినియోగించేందుకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి తప్పనిసరి. 

అందుకే అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కొన్నిరోజుల కిందట భారత్ బయోటెక్ డబ్ల్యూహెచ్ఓకు దరఖాస్తు చేసింది. అయితే, పలు దశల క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన సమగ్ర సమాచారం లోపించిందని డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, డబ్ల్యూహెచ్ఓ కోరిన అదనపు సమాచారాన్ని భారత్ బయోటెక్ పంచుకోవడంతో దరఖాస్తు పరిశీలనకు లైన్ క్లియరైంది. ఈ క్రమంలో ఈ నెల 23న కీలక సమావేశం జరగనుంది. కొవాగ్జిన్ కు సంబంధించిన 3వ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి సమాచారాన్ని ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓకు సమర్పించనున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రక్రియ పూర్తయితే... కొవాగ్జిన్ అత్యవసర వినియోగం కోసం భారత్ బయోటెక్ దాఖలు చేసిన దరఖాస్తును డబ్ల్యూహెచ్ఓ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. అపై అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలా, వద్దా అనేది నిర్ణయిస్తారు. దీనిపై భారత్ బయోటెక్ కు చెందిన ఓ అధికారి స్పందిస్తూ... గతంలో తాము అభివృద్ధి చేసిన టైఫాయిడ్, పోలియో, రోటా వైరస్ వ్యాక్సిన్లకు డబ్ల్యూహెచ్ఓ అనుమతులు మంజూరు చేసిందని, ఇప్పుడు కొవాగ్జిన్ విషయంలోనూ తమకు ఎలాంటి సందేహాలు లేవని పేర్కొన్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, తమ సంస్థకు ఇదేమీ కొత్త కాదని అన్నారు.