TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కవిత కొత్త పార్టీ.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం

Published on: Sun Apr 26, 2026 11:46AM

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరిట కొత్త పార్టీ ప్రారంభించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది.  పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పార్టీలోని అహంకారపూరిత ధోరణులు, ముఖ్యంగా కేటీఆర్ మరియు హరీష్ రావుల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న కల్వకుంట్ల నేరుగా తండ్రి కేసీఆర్ పైనే యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్  ఉద్యమకారులను, మేధావులను పక్కనపెట్టి కేవలం కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీ పార్టీ పునాదులు బలహీనపడ్డాయి.  ఇప్పుడు కవిత సొంత పార్టీతో బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని అంటున్నారు.  

కవిత వ్యూహం కేవలం కొత్త పార్టీ పెట్టడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న కేడర్‌ను తనవైపు తిప్పుకోవడం.  తెలంగాణ రాష్ట్ర సమితి  అనే పాత పేరుపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆమె  తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన  (టీఆర్ఎస్) అనే పేరును ఎంచుకోవడం ద్వారా..  పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమనే వ్యూహం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కవిత కొత్త పార్టీ వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ అని అంటున్నారు. కవిత కొత్త పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే చీలుస్తుందని చెబుతున్నారు.  

అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయనడంలో సందేహం లేదు. కవితకు బీజేపీ పరోక్ష మద్దతు ఉండవచ్చని, తద్వారా బీఆర్ఎస్ బార్గేనింగ్ శక్తిని తగ్గించడమే ఆమె అసలు లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు, కుటుంబ సభ్యుల మధ్య ఈగో క్లాష్‌లు కూడా ఈ చీలికకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని తెలుగువన్ చర్చా వేదికలో సువేరా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  

కవిత నిర్ణయం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తిని సృష్టించవచ్చున్న ఆయన..  ఆమె కేవలం కేసీఆర్ బిడ్డగానే కాకుండా, తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను నిర్మించుకోవాలని చూస్తున్నాన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ బలహీనపడి, క్రమంగా బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు  కొట్టిపారేయలేన్న సువేరా.. కవిత పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆమె ఎంచుకునే నాయకులు, యూత్ మేనిఫెస్టోపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ఆమె బలమైన శక్తిగా ఎదిగితే, తెలంగాణలో త్రిముఖ పోటీ మరింత తీవ్రమై రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మహిళా బిల్లు వంటి అంశాలపై ఆమె చేస్తున్న పోరాటం మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సువేరా అభిప్రాయపడ్డారు.