దేనికైనా రెడీ వివాదం..తెలంగాణ వాదుల మద్దతు

vishnu Denikaina Ready, Denikaina Ready issue, Denikaina Ready controversy, mohan babau Denikaina Ready

 

దేనికైనా రెడీ సినిమా వివాదం తారా స్థాయికి చేరుతోంది. మోహన్ బాబు ఇంటిముందు ఆందోళన జరిపిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులపై దాడిచేయడంపై తెలంగాణ వాదులుకూడా మండిపడుతున్నారు. వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని మోహన్ బాబుతోపాటు ఆయన అనుచరుల్నికూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల చందాలతో బతుకుతున్న మోహన్ బాబు తిరిగి జనంపై దాడిచేయడం అత్యంత హేయమైన విషయమంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.

 

సినిమాలమీద కలెక్షన్లు పోగేసుకుని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేస్తూ పరిహసించే ప్రయత్నాల్ని మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. బ్రాహ్మణులపట్ల మోహన్ బాబు కుటుంబ సభ్యులు దుర్మార్గంగా వ్యవహరించారని తెలంగాణ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ నేత, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఖండించారు. సినిమాలో సీన్లని వెంటనే తొలగించి, ఈ వివాదంపై వెంటనే మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని తెలంగాణ అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయ్.

 

మరోవైపు మంచు విష్ణువర్ధన్ బాబుకూడా అదే స్థాయిలో మండిపడుతున్నారు. నిరసన తెలిపేందుకు వచ్చినవాళ్లు తమ ఇంటిపై దాడి చేయడమేంటంటూ వీరంగమేస్తున్నారు. తానింట్లో లేను కాబట్టి సరిపోయిందని, లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు. ఇంకోసారి ఇలాంటి పని చేయాలనుకున్నవాళ్లు సిటీలో తిరగడానిక్కూడా భయపడాల్సొస్తుందని విష్ణువర్థన్ బాబు హెచ్చరించాడు.ఇరువర్గాలూ రాష్ట్ర మానవహక్కుల సంఘంలో ఫిర్యాదుకూడా చేశాయి.