వినాయకుడి రూపంలో విజయానికి రహస్యాలు!

 

భారతీయుల ఇష్టదైవం గణపతి. వినాయకచవితి రోజున జరిగే హడావుడే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వినాయకుడు ఒక దేవత మాత్రమే కాదనీ... ఈ ప్రకృతిలోని శక్తికి ప్రతిరూపం అని నమ్మేవారూ లేకపోలేదు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా, గణేశుని ప్రతిరూపం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయంటారు పెద్దలు…

 

తల :–

మనిషికి ఏనుగు తల అన్న మాటే చాలా చిత్రంగా కనిపిస్తుంది. కానీ పెద్ద తల గొప్ప బుద్ధిని సూచిస్తుందంటారు. పైగా ఏనుగుకి ఉండే జ్ఞాపకవక్తి చాలా అమోఘం కదా! జీవితంలో ముఖ్యమైన విషయాలు ఎన్నటికీ మర్చిపోకూడదన్న సూచన, శరీరంతో పాటుగా బుద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్న హెచ్చరికా ఏనుగుతలలో కనిపిస్తాయి. వినాయకుడి బుద్ధి ప్రదాత అని ఊరికనే అనలేదు కదా!

 

చెవులు :–

ఏనుగు చెవులు పెద్దవి. ప్రతి మాటనీ శ్రద్ధగా ఆలకించాలని సూచిస్తాయవి. అవతలి మనిషి వాదన పూర్తిగా విన్న తర్వాతే, నిర్ణయం తీసుకోవాలని చెబుతాయి. ఈ కాలంలో అంతా తక్కువ విని ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలనే సూత్రాన్ని గుర్తుచేస్తాయి.

 

కళ్లు :–

ఏనుగు కళ్లు చాలా సునిశితం అంటారు. ప్రతి విషయాన్ని పైపైన కాకుండా సూక్ష్మంగా పరిశీలించాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. పైగా ఏనుగు కళ్లకి వస్తువులు చాలా పెద్దవిగా కనిపిస్తాయట. ప్రమాదాన్నయినా, అవకాశాన్నయినా ముందుగానే పసిగట్టగల దూరదృష్టి పెంపొందించుకోవాలని ఇవి చెబుతున్నాయన్నమాట.

 

తొండం :–

ఏనుగు తొండం నోటికి అడ్డంగా ఉంటుంది. చెట్లని పెళ్లగించడం దగ్గర నుంచి, ఆహారాన్ని అందుకోవడం వరకూ అన్ని పనులూ చేసేస్తుంది. అది చేస్తాం ఇది చేస్తాం అని నోటిమాటగా వాగ్దానాలు చేయడమే కాదు... ఆ మాటలని నిజం చేసుకోవాలనే సూచన అందిస్తుంది.

 

చేతులు :–

రోజులు మారాయి. ఒకేసారి నాలుగు పనులు చేయందే జీవితం గడవడం లేదు. దీన్నే multi tasking అంటున్నాం. వినాయకుని నాలుగు చేతులూ ఈ మల్టీ టాస్కింగ్‌ని సూచిస్తాయి. పైగా ఒకో చేతిలో ఉండే వస్తువు ఒకో లక్షణానికి ప్రతీక. వినాయకునికి ఒక చేతిలో మోదకం అనే తినుబండారం కనిపిస్తుంది (ప్రపంచాన్ని ఆస్వాదించాలి), మరో చేతిలో గొడ్డలిలాంటి ఆయుధం ఉంటుంది (పోరాటానికి వెనుదీయకూడదు), ఇంకో చేతిలో కమలం ఉంటుంది (ప్రపంచంలో ఉంటూనే అతీతంగా ఉండటానికీ, జ్ఞానం కోసం ప్రయత్నించడానికీ, తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేయడానికీ కమలం చిహ్నం), నాలుగో చేయి అభయాన్ని అందిస్తూ ఉంటుంది (సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలి).

 

ఉదరం :–

వినాయకుని ఉదరం సమృద్ధికి చిహ్నం. ఆహారాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలనే సూచన. నిండైన పొట్ట ఉన్న లాఫింగ్ బుద్ధా విగ్రహాలు ఇప్పుడు ఇంటింటా కనిపిస్తున్నాయి. నిజానికి లాఫింగ్‌ బుద్ధాని పోలిన వినాయకుడు మనకి ఉండనే ఉన్నాడు కదా!

 

ఎలుక :–

ఎలుక చపలచిత్తంగా అటూఇటూ తిరుగుతూ ఉంటుంది. మన ఇంద్రియాలూ అంతే! ఎటువైపు పడితే అటు పరుగులు పెడుతూనే ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలనే సూచనని మూషికవాహనుడు అందిస్తున్నాడు. మూషికాన్ని అహంకారానికి చిహ్నంగా పోల్చేవారూ లేకపోలేదు. దాని మీద కూర్చోవడం వల్ల, ఆ అహంకారాన్ని అణచివేయాలనే సూచన కూడా కనిపిస్తుంది.

 

ఆసనం :–

చాలా సందర్భాలలో వినాయకుడు ఎడమ కాలు ముడుచుకుని, కుడి కాలుని కిందకి ఉంచి కనిపిస్తాడు. ప్రశాంతంగా ఉంటూనే అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే త‌త్వానికి ఈ ఆసనాన్ని ప్ర‌తీక‌గా భావిస్తారు. మనిషికి కావల్సింది అదే కదా! స్థిరచిత్తంతో ఉండాలి. కానీ ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే అప్రమత్తత ఉండాలి.

 

ఇవండీ వినాయకుని రూపం వెనుక కనిపించే అర్థాలు. ఇవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఈ వాదనలన్నీ భక్తులు తమకు అనుగుణంగా ఏర్పరుచుకున్నవి కావచ్చు. కానీ మన రోజువారీ జీవితంలో ఉపయోగపడేవే కదా!

- నిర్జర.