ఉత్తరాఖండ్‌ బలపరీక్షకు సుప్రీం ఓకే.. 9 మంది ఎమ్మెల్యేలు నో ఛాన్స్

 

ఉత్తరాఖండ్‌ శాసనసభలో హరీష్‌ రావత్‌ తన బలాన్ని నిరూపించుకునే అవకాశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశిస్తూ నేటి వరకూ గడువు ఇచ్చిన విషయం విదితమే. అయితే దీనిపై సుప్రీంకోర్టు నేడు నిర్ణయం తీసుకుంది. మే 10వ తేదీన శాసనసభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు అంగీకరిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఆరోజు ఉదయం 11 గంటలనుంచి 1 గంట వరకూ రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్‌ మాట్లాడుతూ..  శాసనసభలో జరిగే బలపరీక్షను పరిశీలించడానికి పరిశీలకుడిని నియమించాల్సిందిగా కోరారు. అంతేకాదు పదవీ విరమణ చేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పరిశీలను నియమించాలని ఎజి కోరారు.

 

కాగా అనర్హత వేటు పడిన 9 మంది ఎమ్మెల్యేలు ఈ బలపరీక్షలో పాల్గొనడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో అధికార పార్టీనుంచి వైదొలగి, ప్రతిపక్ష బిజెపిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ సహా 9మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు కోల్పోయినట్లయింది.