పాడెపై ప్రచారం... కాళ్లు కడిగి ఓట్లు అడుగుతున్న నేత..

 

రాజకీయ నాయకులు ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు పలు పద్దతుల్లో అడుగుతుంటారు. హామీలు మీద హామీలు ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా అభ్యర్దులు అప్పుడే ఓటర్లను ఓట్లు అడిగే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ఏకంగా.. పాడెపై ఓటర్ల ఇంటికి వెళ్లి... ఓటర్ల కాళ్లు కడుగుతున్నాడు. వివరాల ప్రకారం...  ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ చౌరీచౌరా నియోజకవర్గం నుండి  రాజన్‌ యాదవ్‌ అలియాస్‌ ఆర్తి బాబా అనే 34 ఏళ్ల వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. దీనిలోభాగంగా ఆయన చాలా విచిత్రంగా పాడెపై ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి వాళ్ల కాళ్లు కడిగి తనకు ఓటు వెయ్యాలని అడుగుతున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో సామాన్యులు తమ హక్కులు పొందలేకపోతున్నారని, బతికున్నా ఈ వ్యవస్థ చనిపోయినట్లుగా భావించేలా చేస్తోందని, అందుకే ఇలా పాడెపై ప్రచారానికి వెళ్తున్నట్లు చెప్తున్నారు. ఆయన మద్దతుదారులు పాడె మోసుకుంటూ ప్రచారానికి తీసుకెళ్తుంటారు. అంతేకాదు ఆయన కార్యాలయాన్ని కూడా రాజ్‌ఘాట్‌ స్మశానంలో నడిపిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల్లో గెలవడానికి మన రాజకీయ నేతలు ఎన్ని పాట్లు పడాలో.. అన్ని పాట్లు పడుతున్నారు.