కొన్ని ప్రోగ్రామ్స్... 'ఇడియట్' బాక్స్ పేరు నిలబెడుతున్నాయా?

 

సినిమా అయితే వారానికో, నెలకో ఒకసారి చూస్తాం. అదీ మనకు ఇష్టం వుంటే టికెట్ కొనుక్కుని మన విచక్షణతో, విజ్ఞతతో తిలకిస్తాం. కాని, టీవీ అలా కాదు. ఒక్కసారి రిమోట్ తీసుకుని బటన్ నొక్కామంటే న్యూస్ నుంచి న్యూసెన్స్ వరకూ అన్నీ వచ్చి మీద పడిపోతాయి. ఇష్టం వున్నా లేకున్నా అలా చూసేస్తూ వుండాల్సి వస్తుంది. పైగా సకుటుంబ సపరివారంగా...

 

టీవీ ప్రభావం సినిమా, పేపర్లు, ఇంటర్నెట్ అన్నిటికంటే ఎక్కువ. అయినా కూడా ఛానల్స్ లో వచ్చే కంటెంట్ పై ఎలాంటి నియంత్రణ, సెన్సార్ ఫిప్ వుండదు. అదే రాను రాను పెద్ద సమస్యగా మారుతోందా? అవుననే కోర్టు కూడా అభిప్రాయపడింది! జబర్దస్త్ కామెడీ షో విషయంలో ఒక కేసు నమోదు కావటంతో ఆ కార్యక్రమ జడ్జ్ లు నాగేంద్రబాబు, రోజా, యాంకర్లు అనసూయ, రేష్మి వంటి వారంతా నోటీసులు అందుకున్నారు. వాటిపై వాళ్లు హైకోర్టుకు వెళ్లగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది!

 

జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు చదవుకున్న వారు, చదువుకోని వారు అందరూ చూస్తారనీ... వాటి వల్ల అందులో చూపేది అంతా నిజమేనని భ్రమపడే అవకాశం వుందని కోర్టు అభిప్రాయపడింది. ఒక స్కిట్ లో న్యాయ వ్యవస్థను అవమానించారని పిటీషనర్ కేసు వేయగా దాన్ని సవాలు చేస్తూ నాగబాబు తదితరలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారు కోరినట్టు కేసునైతే కొట్టి వేసిందిగాని టెలివిజన్ కార్యక్రమాలకు కూడా నియంత్రణా మార్గదర్శకాలు వుండాలని పేర్కొంది.

 

కామెడీ కోసం రూపొందించే కార్యక్రమాలు ఈ మధ్య చాలా సార్లు వివాదాస్పదం అవుతన్నాయి. కొన్ని సార్లు కుల సంఘాలు ఆగ్రహానికి గురైతే చాలా సార్లు మహిళల పట్ల ఈ వినోద కార్యక్రమాల తీరు దారుణంగా వుంటోందని అంటున్న వారు చాలా మంది వుంటున్నారు. గతంలో ఒకసారి ఒక కమెడియన్ మీద భౌతిక దాడి జరిగిన సంఘటన కూడా తెలిసిందే!

 

టీవీకి ఇప్పుడైతే ఎలాంటి నియంత్రణా లేనప్పటికీ ముందు ముందు తగిన మార్గదర్శకాలు జారి చేస్తే బావుంటుంది. ఎందుకంటే, చిన్న పిల్లల నుంచీ ముసలి వారి దాకా అందరూ కలిసి చూసే టీవీ సినిమాల వంటి వాటికన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దానిపై మేధావులు, ప్రభుత్వం, ఇతర సంస్థలు దృష్టి పెట్టాలి...