TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ ట్రంప్ టారిఫ్ టెర్రర్?

Published on: Sat Jul 11, 2026 11:00AM

ట్రంప్ టాక్స్ టెర్రర్ మళ్లీ తెరమీదకు వచ్చింది. రష్యా నుంచి ఏ దేశమైనా సరే చమురు, పెట్రో ఉత్పత్తులను కొనుగోలు చేస్తే.. ఆ దేశంపై 500 శాతం భారీ సుంకం విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు  కొత్త ఆంక్షల బిల్లును కూడా సిద్ధం చేసింది.  ఉక్రెయిన్‌తో సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తున్న రష్యాకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న దేశాలే లక్ష్యంగా అమెరికా   చర్యలకు పూనుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో నలుగురు కీలక అమెరికా సెనెటర్లు ఇప్పటికే ఈ విషయంలో ఒక ఒప్పందానికి రావడం అంతర్జాతీయంగా   రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లు కనుక పూర్తి స్థాయిలో చట్టంగా మారి అమల్లోకి వస్తే..  భారతదేశంపై   ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. 

ప్రస్తుతం రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు, సహజ వాయువు మరియు యురేనియం దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో భారతదేశం ముందు వరుసలో ఉంది. గతంలో కూడా అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ భారత్, చైనాలను ఉద్దేశించి ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఇలాగే కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అప్పట్లోనే ఆయన హెచ్చరించారు.  

అమెరికా తీసుకురావాలని భావిస్తున్న ఈ  బిల్లుకు అక్కడ రాజకీయంగా  మద్దతు లభిస్తోంది. అమెరికా సెనెట్‌లో ఇప్పటికే 84 మంది సభ్యులు ఈ బిల్లుకు  మద్దతు  ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా చేయడమే ఈ ఆర్థిక ఆంక్షల వెనుక ఉన్న అసలు వ్యూహమని అమెరికా చెబుతోంది. రష్యాకు ఇంధన   విక్రయాల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని అడ్డుకుంటేనే యుద్ధం ఆగుతుందని అమెరికా చెబుతోంది.  మరోవైపు..  అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య  ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటువంటి స్థితిలో రష్యా చమురుకొనుగోలు చేసే దేశాలపై  500 శాతం పన్నువిధిస్తే.. చమురు సంక్షోభం మరింత ముదిరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.