హిల్లరీని తొక్కేస్తున్న ట్రంప్... సర్వేల షాకులు

 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు బరిలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత కొద్ది నెలల క్రితం హిల్లరీ క్లింటన్ కంటే ట్రంప్ ముందడుగులో ఉండగా.. ఎప్పుడైతే అతని నోటి దురుసుతనం ఎక్కువవడం.. దానికి తోడు మహిళల ఆరోపణలు అన్నీ కలిసి రావడంతో ట్రంప్ ను వెనక్కి నెట్టి హిల్లరీ ముందుడు వేశారు. ఇంకా జరిగిన మూడు డిబేట్లలో హిల్లరీ మంచి మార్కులు సంపాదించడంతో గెలుపు అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. దానికి తోడు పలు సంస్థల సర్వేలు కూడా హిల్లరీ క్లింటన్ కే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలిపాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్టు కనిపిస్తోంది.

 

రాయిటర్స్ వార్తా సంస్థ సంచలన సర్వే ఫలితాలను వెల్లడించింది. ప్రముఖ మార్కెటింగ్, సర్వే సంస్థ ఇప్సోతో కలిసి రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆధిక్యానికి భారీగా గండికొట్టినట్లు తేలింది. అక్టోబర్ 14 నుంచి 20 మధ్య కాలంలో ట్రంప్ తన ఆధిక్యతను 40 శాతం నుంచి 44 శాతానికి పెంచుకున్నారని, అదే సమయంలో హిల్లరీ ఆధిపత్యానికి భారీగా తగ్గించగలిగారని సర్వేలో పేర్కొన్నారు. అక్టోబర్ 7-13 మధ్య హిల్లరీకి 44 శాతం, ట్రంప్ కు 37 శాతం మద్దతు దక్కింది. నిజానికి జాతీయ సరాసరిలో ఇప్పటికీ ట్రంప్ పై హిల్లరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ట్రంప్ కు 41.9 శాతం మద్దతు లభిస్తే అతని కంటే 6.2 శాతం ఎక్కువ అంటే, 48.1 శాతం ఆధిక్యత హిల్లరీకి ఉంది. పోలింగ్ కు ఇంకా రెండు వారాలు గడువుండటంతో ఆ మాత్రం తేడాను కూడా ట్రంప్ అధిగమిస్తాడనే అభిప్రాయం వ్యక్తమైంది. మరి ఎన్నికలకు ఇంకా రెండు వారాలు గడువు ఉంది. అప్పటిలోగా ఏం జరుగుతుందో.. ఎవరు గెలుస్తారో అని అమెరికన్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.