విభజనకి గవర్నర్ గండం

 

 

 

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వున్నారు. రాష్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ తెగ ఉత్సాహపడిపోతూ పావులు చకచకా కదుపుతున్న ఈ తరుణంలో నరసింహన్ చేస్తున్న ఢిల్లీ పర్యటనకి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. బుధవారం నాడు నరసింహన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రి చిదంబరంతో విడివిడిగా సమావేశమై అరగంటకు పైగా చర్చలు జరిపారు. అలాగే బుధవారమే ఎ.కె.ఆంటోనీతోపాటు రాహుల్‌గాంధీని కూడా కలుస్తున్నారు. ఈ భేటీలలో నరసింహన్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వివరాలనూ పూసగుచ్చినట్టు వివరించే అవకాశం వుంది.


నరసింహన్ కేంద్రానికి ఇచ్చే నివేదికలు రాష్ట్ర విభజన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పాయింటే ఇప్పుడు విభజనవాదుల్లో గుబులు పుట్టిస్తోంది. విభజనవాదులు విమర్శించేదాని ప్రకారం గవర్నర్ నరసింహన్ నూటికి నూరుశాతం సమైక్యవాది. తెలంగాణ మీద కేంద్రానికి గవర్నర్ తప్పుడు నివేదికలు పంపుతున్నారని విభజనవాదులు గతంలో అనేకసార్లు ఆయన మీద ఒంటికాలితో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ  సాక్షిగా ఆయన మీద పేపర్లు విసిరారు. నరసింహన్ మాజీ పోలీసు అధికారి. ఎవర్ని ఎప్పుడు ఎక్కడ దెబ్బకొట్టాలో బాగా తెలిసిన వ్యూహకర్త.



అలాంటి నరసింహన్ తెలంగాణవాదులు తనను ఎన్నిరకాలుగా విమర్శించినా, హద్దుమీరి ఆరోపణలు చేసినా ఏనాడూ ఆవేశపడలేదు. చాలా సందర్భాలలో ఆయన నోటి వెంట ‘రాష్ట్రం’ బాగుండాలనే మాటలు వినిపించాయి.  అలా విభజన వ్యతిరేకిగా ముద్రపడిన నరసింహన్ ఢిల్లీలో నివేదికలు అందిస్తూ ఉండటం తెలంగాణవాదుల్లో గుబులు పుట్టిస్తోంది. నరసింహన్ ఎలాంటి నివేదికలు ఇస్తారో, తెలంగాణకు ఎక్కడ ఏ పుల్ల అడ్డువేస్తారో అని విభజనవాదులు భయపడుతున్నారు. విభజనవాదులు గతంలో చేసిన విమర్శలను నరసింహన్ మనసులో పెట్టుకుని విభజనకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తారేమోనన్న దడ విభజనవాదుల్ని పట్టి పీడిస్తోంది. తెలంగాణకు గవర్నర్ రూపంలో వచ్చిన గండం గడిచిపోవాలని విభజనవాదులు కోరుకుంటున్నారు.