మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష?

 

తెలంగాణలో మరోసారి భారీ స్థాయిలో ఆపరేషన్ ఆకర్ష మొదలవబోతోందా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవునని అనక తప్పడం లేదు. ఆపరేషన్ ఆకర్ష పథకానికి ఆద్యుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఈ స్కీముని ఉపయోగించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాగినప్పుడు, ఆ విధానాన్ని చూసి రాజకీయ పరిశీలకులు అబ్బురపడిపోయారు. వైఎస్సార్ తర్వాత అంత స్థాయిలో ఆపరేషన్ ఆకర్షను అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. ఆమధ్య సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి ప్రతిపక్షంలో వున్న ఎమ్మెల్యేలను తమ గూట్లోకి లాక్కున్నారు. తెలంగాణలో మరో పార్టీ అనేదే లేకుండా చేయాలని గట్టి పట్టుదలతో వున్న సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షను సక్సెస్ ఫుల్‌గా అమలు చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామందిని టీఆర్ఎస్‌లోకి లాగేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అయితే దాదాపు ఖాళీ అయిపోయింది. అధికార పార్టీ దూకుడు గురించి ప్రతిపక్షాలు స్పీకర్‌కి ఫిర్యాదు చేశాయి. అయితే చాలా బిజీగా వుండే గౌరవనీయ స్పీకర్ గారికి సమయం కుదరకపోవడం వల్ల ఆ ఫిర్యాదులను ఇంకా పరిశీలించలేదు.  తెలంగాణలో టీఆర్ఎస్ ప్రయోగించిన తరహా వ్యూహాన్నే ప్రయోగించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగుదేశం పార్టీ వైపీసీ నుంచి కొంతమందిని తన గూటికి తెచ్చుకుంది. అయితే టీఆర్ఎస్ స్థాయిలో మాత్రం ఆపరేషన్ ఆకర్షను అమలు చేయలేకపోయింది.

 

ఫ్లాష్ బ్యాక్ ఇలా వుంటే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ మరోసారి ఆపరేషన్ ఆకర్షను ప్రయోగించడానికి సర్వ సన్నాహాలూ పూర్తి చేసినట్టు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచి ఆఫర్లు ఇచ్చారని, త్వరలో వారిని గులాబీ తీర్థం అందించబోతున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ముఖ్య నాయకులను సీక్రెట్‌గా కలిసినట్టు తెలుస్తోంది. పాత మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ విప్ సంపత్ కుమార్ (అలంపూర్) కూడా టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎవరు టీఆర్ఎస్‌లో చేరినా కేసీఆర్ అందిస్తున్న పరిపాలకు ముగ్ధులయ్యే పార్టీ మారుతూ వుంటారు. త్వరలో పార్టీ మారబోయేవారు కూడా ఇదే కారణాన్ని చెప్పే అవకాశాలున్నాయి. సంపత్ కుమార్ విషయానికి వస్తే జిల్లాలో డి.కె.అరుణతో వున్న విభేదాలు కూడా ఆయన పార్టీ మారడానికి మరో కారణమని అంటున్నారు. అయితే సంపత్ కుమార్ మాత్రం తానంటే గిట్టనివాళ్ళే తాను పార్టీ మారబోతున్నట్టు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అయితే ఇప్పటి వరకు టీఆర్ఎస్‌లో చేరినవాళ్ళంతా పార్టీ మారేముందు ఇలాగే వాపోయిన వాళ్ళు కావడం వల్ల సంపత్ కుమార్ వాపోవడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ప్రతిపక్షాలను ఒక ఆట ఆడుకుంటున్న కేసీఆర్‌కి అభినందనలు.