TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయ్‌కు గవర్నర్ ఆహ్వానం...ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం!

Published on: Wed May 6, 2026 3:45PM

 

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం  అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అధికారికంగా ఆహ్వానించారు.

ఈ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం స్వల్ప దూరంలో నిలిచినప్పటికీ, అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా విజయ్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రాజ్ భవన్, మెజారిటీ నిరూపించుకోవాలని సూచిస్తూ ఆయనను ఆహ్వానించింది.

దశాబ్దాలుగా తమిళనాట ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ఆధిపత్యానికి విజయ్ ఈ దెబ్బతో గండి కొట్టారు. ముఖ్యంగా డీఎంకే కంచుకోటలను సైతం టీవీకే బద్దలు కొట్టడం గమనార్హం. ప్రస్తుతం విజయ్ పార్టీకి కాంగ్రెస్ తన మద్దతును ప్రకటించడంతో ఆయన బలం 113కు చేరింది. ఇతర చిన్న పార్టీలు మరియు స్వతంత్రుల మద్దతుతో సునాయాసంగా మేజారిటీ మార్కును అందుకుంటామని టీవీకే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు ప్రకటించింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు తెలుపుతూ ఏఐసీసీ తమిళనాడు ఇన్‌ఛార్జ్ గిరీశ్ చోడంకర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

 47 స్థానాలను గెలుచుకున్న అన్నాడీఎంకేలో ఇప్పుడు భారీ 'ముసలం' మొదలైంది. పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలుటీవీకే పార్టీ వైపు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం కార్యాలయంలో సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా విజయ్‌కి మద్దతు ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

విజయ్ రాకతో తమిళనాడులో 62 ఏళ్ల ద్రావిడ పార్టీల పాలనకు బ్రేక్ పడినట్లయింది. ఆయన ముఖ్యమంత్రిగా మే 7వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇప్పటికే ఈ చారిత్రక వేడుక కోసం ముస్తాబవుతోంది. విజయ్ తన క్యాబినెట్‌లో యువతకు, విద్యావంతులకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంపై తమిళనాట హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజలు మార్పును కోరుకున్నారని, విజయ్ రాకతో కొత్త తరహా రాజకీయాలు మొదలవుతాయని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు, ప్రతిపక్షాలు ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలని విమర్శలు గుప్పిస్తున్నాయి.

తమిళనాడును ప్రగతి పథంలో నడిపిస్తానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తానని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరి కొద్ది గంటల్లోనే ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనుండటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఇప్పుడు తమిళనాడుపైనే ఉంది.