ఆ మేజర్ ను శిక్షించమన్నారు! మోదీ సర్కార్ సత్కరించింది!

 

కాశ్మీర్ లోయలో అల్లరి మూకలు అరాచకం సృష్టిస్తున్నాయి. అదే సమయంలో భారత సైన్యం కూడా ధీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. పోయిన సంవత్సరం బుర్హాన్ వనీ అనే ఉగ్రవాది ఎన్ కౌంటరైనప్పట్నుంచీ పాక్ ప్రేరేపిత వేర్పాటు వాదుల రాళ్ల వర్షాలు ఆగటం లేదు. అయితే, ఆర్మీ పెల్లెట్ గన్స్ వాడినా, కాల్పులు జరిపినా వివాదాస్పదం అవుతూనే వుంది. మానవ హక్కుల ఉల్లంఘన అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే, ఎవరు ఎన్ని విధాల వేలెత్తి చూపినా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ వెనక్కి తగ్గే సూచనలు కనిపించటం లేదు. ఆందోళనకారులతో మెతకగా ప్రవర్తించే ఉద్దేశం వున్నట్టు ఎంత మాత్రం భారత్ సంకేతాలు ఇవ్వటం లేదు.

 

ఏప్రెల్ నెలలో శ్రీనగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఆందోళనకారులు తీవ్రమైన రాళ్ల దాడి చేశారు. దానికి ప్రతిగా వాళ్లలోని ఒక రాళ్లు రువ్వుతున్న కాశ్మీరీ యువకుడ్నే మేజర్ నితిన్ గొగోయ్ తన జీపుకు ముందు భాగంలో కట్టేసుకుని ముందుకు పోయాడు. ఈ వ్యూహం ఫలించి రాళ్లు రువ్వుతు్న ఆందోళనకారులు ఆర్మీకి దారిచ్చారు. అయితే, జీపుకి ఒక మనిషిని అలా కట్టేసిన వీడియో బయటకి రావటంతో వివాదం తలెత్తింది. సహజంగానే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చివరకు ఆ పని చేసిన మేజర్ పై ఆర్మీ శాఖా పరమైన విచారణ చేసింది. దానిలో భాగంగా ఈ మధ్యే మేజర్ నితిన్ గొగోయ్ తప్పేం లేదని తే్ల్చింది. ఆయన ఆందోళనకారుల రాళ్ల వర్షం నుంచి తప్పించుకుని శాంతి  భద్రతల్ని కాపాడటానికే అలా చేశాడని ఆర్మీ కోర్టు అభిప్రాయపడింది!

 

కాశ్మీరి వేర్పాటు వాదిని జీపుకి కట్టేసిన మేజర్ ని నిర్దోషిగా పేర్కొనటమే కాక ఆయనకి భారత ఆర్మీ కమండేషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. ఇలా పురస్కారాలు ఇవ్వటం సబబు కాదని అప్పుడే శరద్ యాదవ్ లాంటి నేతలు మోదీ సర్కార్ పై గళం విప్పారు. కాని, నిత్యం నరకం లాంటి పరిస్థితుల్లో వుంటూ దేశాన్ని రక్షిస్తోన్న ఆర్మీకి నైతిక మద్దతు ఇవ్వటం తప్పు కాదన్నదే సర్కార్, ఆర్మీ చీఫ్ ఉద్దేశంలా కనిపిస్తోంది. అందుకే, రాళ్లు రువ్విన వ్యక్తిని జీపుకి కట్టేసిన మేజర్ పై చర్యలు తీసుకోవటం కాకుండా.. ఏకంగా అవార్డ్ ఇచ్చి సత్కరించారు! ఇది ఖచ్చితంగా ఆందోళకారులకి, వేర్పాటువాదులకి, పాక్ అనుకూల శక్తులకి గట్టి సంకేతమే అనుకోవాలి. భారత్ తాటాకు చప్పుళ్ల లాంటి రాళ్ల దాడులకి ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడదని చెప్పినట్లైంది!