ఏం కొంప ముంచుతారో?!

 

 

 

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గురువారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మూకుమ్మడిగా కలవబోతున్నారట. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయబోతున్నారట. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి సీమాంధ్రులలో గుండె దడ మొదలైంది. రాష్ట్ర విభజన చేయొద్దని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని అడగటానికి వెళ్తుంటే సీమాంధ్రులు భయపడటమెందుకు? అక్కడే వుంది అసలు తిరకాసు.

 

ఇప్పుడు రాష్ట్రం విభజన సమస్య ఎదుర్కోవడానికి ప్రధాన కారణం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలేనన్న వాస్తవం సీమాంధ్రులు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర అతి వినయం ప్రదర్శించడం, సమైక్య వాదనను సమర్థంగా వినిపించకపోవడం, అధిష్టానం అభిప్రాయం అడిగినప్పుడల్లా, ‘‘కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం’’ అని చెప్పడం, రాష్ట్రాన్ని విభజించినా సీమాంధ్రులు పెద్దగా ఫీలవరని కేంద్రానికి నివేదికలు ఇవ్వడం.. ఇవన్నీ రాష్ట్ర విభజనకు ఆజ్యం పోశాయి.



కేంద్రం విభజన నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యాయి. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున జరుగుతున్న ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం విభజన విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రపతి దగ్గరకి వెళ్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అక్కడ ఏం మాట్లాడబోతున్నారో, ఏం కొంప ముంచబోతున్నారోన్న భయం సీమాంధ్రులలో వుంది. పైకి మాత్రం సమైక్య రాష్ట్రం కోసమే రాష్ట్రపతి దగ్గరకి వెళ్తున్నామని చెప్తున్నా, లోపల రహస్య ఎజండా ఏమైనా ఉందేమోనన్న అనుమానాలు సీమాంధ్రులలో కలుగుతున్నాయి. కలగవా మరి?