సొంత బంధువులను దూరంగా ఉంచాలన్న శశికళ...


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పార్టీ బాధ్యతలు పన్నీర్ సెల్వం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సీఎంగా పార్టీ బాధ్యతలు చేపట్టినా పెత్తనం మొత్తం శశికళదే అని ఆరోపణలు వస్తున్న సంగతి కూడా విదితమే. జయలలిత మరణం తరువాత శశికళపైనా చాలా ఆరోపణలు, ఒక రకంగా జయ లలిత మృతికి శశికళే కారణమంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శశికళ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. తన కుటంబసభ్యుల్లో ఎవరికి పార్టీ తరపున సీట్లుకానీ.. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంచాలని. దీనిలో భాగంగానే ఆమె జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్స్‌లో తన వాళ్లందరితో నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె ఈ విషయం చెప్పినట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులలో ఎవరైనా ఏం చెప్పినా అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రులు, పార్టీ కీలక నేతలందరికీ కూడా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి శశికళ పోయెస్ గార్డెన్స్ నివాసంలోనే ఉంటారని సమాచారం. ప్రస్తుతానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారని, కానీ తర్వాత వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత ఆమె వదిన ఇళవరసి మాత్రం శశికళతో ఉంటారని చెబుతున్నారు. అయితే.. తాజా విమర్శల నేపథ్యంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, ప్రజలు వేలెత్తిచూపే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.