చిక్కుల్లో ప‌ళ‌నిస్వామి.. డీఎంకే పిటిష‌న్ పై రేప‌టికి వాయిదా

త‌మిళ‌నాడు కొత్త ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌ళ‌నిస్వామికి ఇక్క‌ట్లు త‌ప్పేలా లేవు. ఈ నెల 18న రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష చెల్ల‌దంటూ డీఎంకే మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. దీనిని స్వీక‌రించిన న్యాయ‌స్థానం..ఇవాళ విచారణ జ‌రుపుతామ‌ని తెలిపింది. అయితే తాజాగా విచార‌ణ‌ను రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప‌న్నీర్ సెల్వంను కాద‌ని ప‌ళ‌నిస్వామిని ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్ప‌టికి అసెంబ్లీలో బ‌లాన్ని నిరూపించుకోవాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగర్ రావు ఆదేశించారు. బల‌నిరూప‌ణ సంద‌ర్భంగా అసెంబ్లీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. డీఎంకే స‌భ్యులు సమావేశాల‌కు అడ్డుత‌గ‌ల‌డంతో పాటు స్పీక‌ర్ స్థానాన్ని అగౌర‌వ‌ప‌ర‌చ‌డంతో స్పీక‌ర్ ధ‌న్ పాల్ డీఎంకే స‌భ్యుల‌ను మార్ష‌ల్స్ బ‌య‌ట‌కు పంపించారు. అయితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లేకుండా జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష చెల్ల‌దంటూ డీఎంకే న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. విశ్వాస ప‌రీక్ష‌లో ర‌హ‌స్య ఓటింగ్ జ‌ర‌పాల‌ని తాము కోరిన‌ప్ప‌టికి స్పీక‌ర్ ప‌ట్టించుకోలేద‌ని..మార్ష‌ల్స్ తో దాడి చేయించార‌ని పిటిష‌న్ లో పేర్కొంది.