కేసీఆర్ పరిపాలనలో ఫెయిల్: రేవంత్ రెడ్డి

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ అధికారుల కొరత కారణంగా ఆశించినంత సమర్ధమయిన పాలన అందించలేకపోతున్నామని త్వరలోనే అన్నీ సర్దుకొంటాయని అంతవరకు ప్రజలు, ప్రతిపక్షాలు కూడా కొంచెం ఓపిక పట్టాలని కోరడం అందరూ విన్నారు. కానీ తెలంగాణా తెదేపా శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి దానిపై స్పందించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సమస్య కేవలం తెలంగాణాకే కాక ఆంద్రప్రదేశ్ కు కూడా ఉందని, అయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా అధికారుల కొరతని సాకుగా చూపి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కనబెట్టలేదని, అన్నిటినీ ఎంతో సమర్ధంగా నిర్వహించుకొంటూ పరిపాలన సాగిస్తున్నారని, కానీ కేసీఆర్ పరిపాలన చేతకాకనే ఇటువంటి కుంటి సాకులు చెపుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేసారు.

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణాలో మెదక్‌ జిల్లాకు చెందిన రఘునందనరావు అనే ఐ.ఏ.యస్. అధికారిని కృష్ణాజిల్లా కలెక్టర్‌గా నియమించుకొని సేవలు పొందుతుంటే, కేసీఆర్ మాత్రం ఉన్నవారితో కూడా సక్రమంగా పని చేయించుకోలేకపోతున్నారని విమర్శించారు. కార్తికేయన్ అనే సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి, కేసీఆర్ నిర్ణయంతో అసంతృప్తితో చెంది దీర్గకాలిక శలవుపై వెళ్లిపోవడాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తుచేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర పార్టీల శాసనసభ్యులను తెరాసలోకి ఆకర్షించడానికి పడుతున్న కష్టమేదో ప్రభుత్వం నడపడం కోసం పడితే తప్పకుండా మెరుగయిన ఫలితాలు కనబడి ఉండేవని విమర్శించారు.