ఏపీ పొలిటికల్ లీడర్స్‌లో సంగీత గుబులు... బయటికి రానున్న బడా బాబుల పేర్లు
Published on: Fri Mar 31, 2017 4:33PM

చూడ్డానికి హీరోయిన్‌లాగా ఉంటుంది. మంచి అమ్మాయిలా కనిపిస్తుంది. కానీ ఆమె అసలు స్వరూపం తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మనమే కాదు పోలీసులు కూడా మొదట షాక్ తిన్నారు. ఈ అమ్మాయా... ఇంటర్నేషనల్ స్మగ్లరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. అంతేకాదు అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కలు చూపించింది. కోర్టు సమన్లతో కోల్‌కతా వెళ్లిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. పేరు మోసిన న్యాయవాదులు పదుల సంఖ్యలో ఆమె కోసం క్యూకట్టారు. దాంతో ఆమెను అరెస్ట్ చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఆ తర్వాత అనేకసార్లు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. అలా దాదాపు 8నెలలపాటు ఏపీ పోలీసులను ముప్పుతిప్పలుపెట్టింది. ఇంతకీ ఈమె ఎవరునుకుంటున్నారా.... మోస్ట్ డేంజరస్ ఇంటర్నేషనల్ రెడ్‌శాండిల్ స్మగ్లర్ సంగీత ఛటర్జీ. కోల్‌కతాలో రెక్కీ నిర్వహించి, స్పెషల్ ఆపరేషన్‌తో లేడీ డాన్ సంగీతని ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు.
అందమైన ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగాన్ని వదిలేసి... ఎర్రదొంగలతో జతకట్టింది. బడా స్మగ్లర్ మార్కొండ లక్ష్మణ్‌తో పరిచయం పెంచుకుని, చివరి అతడ్నే పెళ్లి చేసుకుని, నేర సామ్రాజ్యాన్ని ఏలుతూవచ్చింది. ఒకపక్క ఎర్రచందనం స్మగ్లింగ్... మరోపక్క హవాలా బిజినెస్ చేస్తూ...వందల కోట్లు కూడబెట్టింది. అయితే లక్ష్మణ్ అరెస్టుతో సంగీత గుట్టురట్టయింది. సంగీత నేర సామ్రాజ్యాన్ని చూసిన పోలీసులే విస్మయానికి గురయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్, హవాలా వ్యాపారంతోపాటు నకిలీ తుపాకీ లైసెన్సుల దందా కూడా చేసిన సంగీత ఛటర్జీ వందల కోట్లు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే సంగీత అరెస్టుతో పలువురు ఏపీ పొలిటికల్ లీడర్లలో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. సంగీతను నాలుగురోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు... ఎవరెవరితో సంబంధాలున్నాయ్?... ఏ రాజకీయ నేతల అండ ఉంది?.... సహకరించిందెవరనే విషయాలపై కూపీ లాగుతున్నారు. సంగీత నోరువిప్పితే చాలామంది బడా బాబుల పేర్లు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. దాంతో సంగీతతో లింకులన్న నేతలు, బడా బాబుల గుండెల్లో గుబులు మొదలైందని, తమ పేర్లు బయటికి రాకుండా లాబీయింగ్ మొదలు పెట్టారని అంటున్నారు.


