రాయలసీమ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాన్ని వైకాపా ప్రేరేపిస్తోందా?

సార్వత్రిక ఎన్నికలలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో చాలా మంది నేతలు తమ పార్టీ తప్పకుండా ఎన్నికలలో ఘన విజయం సాధించి రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా చక్రం తిప్పుతుందని గట్టిగా నమ్మారు. జగన్ తను ముఖ్యమంత్రి అయిపోయినట్లే కలలు కంటూ తను చేయబోయే ఐదు సంతకాల గురించి కూడా జనాన్ని బాగానే ఊదరగొట్టారు. కానీ ఎన్నికలలో పరిస్థితి తారుమారయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే కోరిక నెరవేరలేదు. ఇప్పుడు పార్టీలో నేతలు మరో ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూడక తప్పదు. చూసినా అప్పటి పరిస్థితి ఏవిధంగా ఉంటుదో ఎవరూ చెప్పలేరు. ఈలోగా పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకొంటాయో కూడా ఊహించడం కష్టం. బహుశః అందుకే ఇప్పుడు చాప క్రింద నీరులా మెల్లగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వైకాపా నిప్పు రాజేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది.

 

ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ఆ మధ్యన ఒకసారి నంద్యాల మండలంలో పాండురంగపురం గ్రామంలో జరిగిన ఒక గ్రామసభలో మాట్లాడుతూ, తాను ఏనాడు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోలేదని, కానీ ఇప్పుడు సీమ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కోరుకొంటున్నానని అన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం సాధించుకొంటేనే రాయలసీమ రైతులు బాగు పడతారని ఆయన అన్నారు. వైకాపాలో ఆయన చాలా సీనియర్ నేత. జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీలో మరే సీనియర్ నాయకుడు గానీ ఆయన మాటలను ఖండించకపోవడం గమనిస్తే ఆయన పార్టీ అభిప్రాయాన్నే పరోక్షంగా ప్రకటించినట్లు    భావించవచ్చు. ఇంతకు ముందు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడిన వైకాపా ఇప్పుడు రాష్ట్ర విభజన జరగాలని కోరుకోవడం చాలా ఆశ్చర్యకరమయిన విషయమే. వైకాపా నేత చెప్పిన మాటల ప్రకారం చూస్తే వైకాపా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నిప్పు రాజేయాలనుకొంటున్నట్లు అర్ధమవుతోంది. అంటే జగన్ తను ముఖ్యమంత్రి అవడం కోసం రాష్ట్రాన్ని మరోసారి ముక్కలు చేయడానికి కూడా సంకోచించరని స్పష్టమవుతోంది.


రాయలసీమ అన్నివిధాల వెనుకబడుందనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. అందుకు ప్రధాన కారణం అక్కడి ప్రజాప్రతినిధులలో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన లేకపోవడమే. రాయలసీమ నుండి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయారు తప్ప ఏనాడు సీమను పట్టించుకొన్న పాపాన్నపోలేదు. అయినప్పటికీ సీమతో సహా మిగిలిన జిల్లాల ప్రజలందరూ కూడా హైదరాబాదు మన రాష్ట్ర రాజధానే కదా అనే ఉదారమయిన ధోరణితో ఎన్నడూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అందుకే అందరూ కలిసి హైదరాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవిభజనకు పూనుకొన్నప్పుడు దానికి వ్యతిరేఖంగా చాలా తీవ్రంగా పోరాడారు. ఆ తరువాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై వాడి వేడి చర్చ జరుగుతున్నపుడు సీమ ప్రజలు వెనుకబడిన తమ ప్రాంతం అభివృద్ధి చెందాలనే తపనతో కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయమని ఉద్యమించారు తప్ప ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు చేయలేదు. కానీ ఇదే అదునుగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తప్ప బాగుపడలేమని వైకాపా నేతలు సీమ ప్రజలకు హితబోధ చేయడం కేవలం అధికార కాంక్షతో చేసిన ప్రయత్నమేనని చెప్పకతప్పదు. సీమ ప్రజల అసంతృప్తినే మరింత పెంచిపోషించగలిగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకొంటుందని వైకాపా నేతల ఆలోచన కావచ్చును. బహుశః అందుకే కొందరు నేతలు చాప క్రింద నీరులా రాయలసీమ ప్రజలను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నట్లు అప్పుడప్పుడు వార్తలు వినపడుతున్నాయి.


ఒకప్పుడు తెరాస నేతలు కూడా తెలంగాణా ఏర్పడగానే ప్రజల జీవితాలలో ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్నట్లు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అందరూ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాలకు ఎంత అనర్ధం జరిగిందో, జరుగుతోందో చూసిన తరువాత కూడా వైకాపా నేతలు అధికారం చేజిక్కించుకోవడం కోసం మరోమారు రాష్ట్ర విభజన జరగాలని కోరుకొంటున్నట్లయితే అంత కంటే దారుణమయిన విషయం మరొకటి ఉండబోదు. అందువల్ల ఇకపై ఏ రాజకీయ నేతయినా మరోమారు రాష్ట్ర విభజన జరగాలని హితబోధలు చేసినట్లయితే, సీమ ప్రజలు అటువంటివారికి తక్షణమే బుద్ధి చెప్పాలి. రాయలసీమ జిల్లాలు కూడా మిగిలిన జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందాలని అందరూ కోరుకొందాము. అవసరమయితే అందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ సాధించుకొందాము. రాజకీయ నాయకుల స్వార్ధం కోసం మరోసారి మన రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది.