తెలంగాణ అభ్యుదయ కవి రావెళ్ల కన్నుమూత

 

 

 

తెలంగాణ తొలి గేయ రచయిత, అభ్యుదయ కవి.. నిజాం వ్యతిరేక పోరాట యోధుడు.. రావెళ్ల వెంకట రామారావు ఇక లేరు. మంగళవారం తన స్వగ్రామం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య సుగుణమ్మ, నలుగురు కుమారులు ఉన్నారు. ఒకచేత తుపాకీతో సాయుధ పోరాటం చేస్తూనే.. మరోచేత కలంపట్టి నిజాం వ్యతిరేక రచనలు సాగించిన సాహితీ దిగ్గజం రావెళ్ల.

 

సంపన్న వ్యవసాయ కుటుంబంలో లక్ష్మయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఆయన, చిన్నతనం నుంచే అభ్యుదయతత్వం అలవడింది. కూలీలతో కలిసి పొలం పనులు చేసే ఈయనను ఊరిలోనివారు "ఉన్నత కుటుంబంలో పుట్టిన నీకు కూలిపనులెందుకు'' అని వారించేవారు. కానీ, "కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకు బలం.. రజాకార్లను తరిమేస్తే తెలంగాణకు వరం'' అని బదులివ్వడమే ఆయన నోట వెలువడిన తొలి కవితగా మారింది. దేశ్‌ముఖ్‌లు రజాకార్లను ఎదిరించినందుకు జైలు జీవితం అనుభవించారు.



జైలునే సాహిత్య పాఠశాలగా మార్చుకున్నారు. పద్య, వచన, గేయ కవిత్వంలో అనేక అవార్డులు, బిరుదులు పొందిన రావెళ్ల.. దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ తదితర ప్రముఖుల సహచరుడు గా పేరొందారు. పల్లెభారతి, జీవనరాగం, అనల తల్పం, రాగజ్యోతులువంటి కవితా సంకలనాలు వెలువరించారు. తెలుగు, ఉర్దూల్లో అద్భుతంగా రాయడంతోపాటు అనర్గళంగా మాట్లాడగలగడం రావెళ్ల మరో ప్రత్యేకత. కాగా.. రావెళ్ల మృతికి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.