రామానుజాచార్య : 1000ఏళ్లుగా వీస్తోన్న ఆధ్యాత్మిక సుగంధం!

 
ఒక వ్యక్తి ప్రభావం ఎంత వరకూ వుంటుంది? అతడి గురించి బాధపడేవారు, జ్ఞాపకం వుంచుకునేవారు, ఆలోచించే వారు, అతడి ప్రభావానికి లోనయ్యే వారు అతడి తరం వారై వుంటారు! అతడి బంధువలు, మిత్రులు, ఇతరులు ఇలాంటి వారు. అలాగే, తరువాత తరంలోని పిల్లలు, ముందు తరంలోని పెద్దలు కూడా కొన్ని సార్లు వ్యక్తుల ప్రభావానికి లోనవుతుంటారు! కాని, ఇదంతా సామాన్యుల సంగతి! అసామాన్యుల సంగతి వేరు! వారు తమ తరాన్ని, తరువాతి తరాల్ని కూడా ప్రభావితం చేస్తారు! రాబోయే ఎన్నో ఏళ్ల వరకూ గొప్ప వారి ప్రభావం వుంటుంది. ఒక గాంధీ, ఒక బోస్, ఒక భగత్ సింగ్… ఇలాంటి వారన్నమాట!

 

మనం ఎప్పుడూ పెద్దగా ఆలోచించం కాని… మానవ జాతి చరిత్రలో అత్యంత ప్రబావం చూపిన గొప్పవాళ్లు ఎవరు? మనం ఇప్పుడే మాట్లాడుకున్నట్టు మహాత్మా గాంధీ లాంటి వారు ప్రభావవంతులే! కాని, వారి ప్రభావానికి కూడా ఒక పరిమితి వుంటుంది. ఒక్కో రోజు గడిచే కొద్దీ ఎంతటి గొప్ప వ్యక్తి ప్రభావమైనా జనంపై తగ్గిపోతూ వస్తుంది. అందుకే, ఒకప్పటి రాజుల గురించి ఆనాటి పుస్తకాలు గొప్పగా చెబుతాయి. మనకి మాత్రం అంత ఫీలింగ్ ఏం కలగదు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనిపించుకున్న జగత్ విజేత ఇవాళ్ల మనుషులకి ఏమంత గ్రేటని?

 

గొప్ప గొప్ప వారు సాధించే భౌతిక విజయాలు అగ్ని లాంటివి! అప్పటి వారికి అవ్వి వెచ్చగా తగలవచ్చు. కాని, ఒక్కో తరం గడుస్తున్న కొద్దీ వారి విజయాల సెగ క్రమంగా తగ్గిపోతుంది. కాని, ఒక మహాత్ముడి ప్రభావం వెయ్యేళ్ల తరువాత ఇవాళ్ల కూడా మనపై తీవ్రంగా వుందంటే… దాన్ని మీరేమంటారు? ఖచ్చితంగా అది రాజ్య విస్తరణో, ధన సంపాదనో లాంటి భౌతిక విజయమైతే కాదు! అంతకన్నా ఎక్కువైన మరేదో! అలాంటి అలౌకికమైన ప్రభావం ప్రదర్శించిన సంఘ సంస్కర్త, భారతీయ తత్వచింతనకు తీక్షణమైన నిదర్శనం … రామానుజాచార్యులు!

 

రామానుజులు అనగానే మనకు వైష్ణవులు గుర్తుకు వస్తారు, వైష్ణవ ఆలయాలు కళ్ల ముందు కదులుతాయి. అయితే, ఆయన వెయ్యేళ్ల కిందట ఆదిశంకరుల జయంతికి ఒక్క రోజు తరువాత పుట్టారు. 1017వ సంవత్సరంలో ఆయన శంకరుల అద్వైతాన్ని మరో అడుగు ముందుకు తీసుకు వెళ్లటానికి అవతరించారు. అంతే కాదు, అద్వైతం అంతా ఒక్కటేనని చెబితే … రామానుజులు ఆ ఒక్కటీ శ్రీమహావిష్ణువే అని నొక్కి చెప్పారు. అందుకే, ఆయన వాదాన్ని విశిష్టాద్వైతం అంటారు! ఆదిశంకరులు తమ కాలంలో ప్రబలిపోయిన ఆచారకాండని ఖండించేందుకు వేదాంత ఆధారంగా అద్వైతం ప్రచారం చేశారు. కాని, రామానుజుల కాలం నాటికి బౌద్ధ, జైన మతాల నుంచి హిందూ మతం ఒత్తిడి ఎదుర్కొంది. అంతే కాదు, రానున్న కాలంలో ముస్లిమ్, క్రిస్టియన్ మతాలు కూడా మన దేశంలోకి రాబోతున్నాయి. అటువంటి సమయంలో రామానుజులు నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించే అద్వైతం బదులు మూర్తి రూపంలో విష్ణువును పూజించే విశిష్టాద్వైతం ముందుకు తెచ్చారు. ఇదే తరువాతి కాలంలో ఎందరో అవతార పురుషులు నమ్మి ఆచారించిన భక్తి ఉద్యమానికి మూలమైంది. భారతీయ సమాజంలో విషంలా పాకిన కులాల సంస్కృతికి వ్యతిరేకంగా భక్తి ఉద్యమం పని చేసింది. స్వతంత్ర పోరాటానికి కూడా అది మేలు చేసింది. అలా వెయ్యేళ్ల కిందటే రామానుజులు భవిష్యత్ భారతావనికి కావాల్సిన ప్రబోధాల్ని సమాజానికి అందించారు!

 

రామానుజాచార్యులు పుట్టుకతో తమిళ బ్రాహ్మణుడైనా మనుషులందరూ సమానమని నమ్మిన ఆదర్శవాది! ఆయన కాలంలో నారాయణ అష్టాక్షరి మంత్రం కూడా పరమ రహస్యంగా వుండేది. దాన్ని అన్ని కులాల వారికి అందించటం కోసం శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయ గోపురం ఎక్కి ఊరంతా వినపడేలా ఉచ్ఛరించాడట! తనతోటి వారు ఏ కులం వారైనా, మతం వారైనా ఉద్ధరిపంబడాలనేదే ఆయన ఆకాంక్ష! అదే తరువాతి కాలంలో ఎందరో సంఘ సంస్కర్తలకి ప్రేరణగా నిలిచింది. ఆర్య సమాజం స్థాపించిన దయానంద్ సరస్వతి రామానుజుల తరహాలోనే గాయత్రీ మంత్రాన్ని అన్ని కులాలు, మతాల వారికి ఉపదేశించారు!

 

భారతదేశం ఉత్తరాన వున్న ఆర్యావర్తంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి అవతార పురుషులు ఉద్భవించి ధర్మ రక్షణ చేశారంటున్నాయి పురాణాలు. అదే ధర్మ రక్షణ దక్షిణాదిలో ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు జ్ఞాన మార్గంలో చేశారు. రామ, కృష్ణులు రాక్షస సంహారం చేస్తే ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్యులు రాక్షస ప్రవవృత్తుల్నీ, రాక్షస ఆచారాల్ని అంతం చేశారు! ఈ కోవలో హిందూ మతానికి పటిష్టమైన ఆలయ వ్యవస్థని అందించిన భగవద్ రామానుజులు ప్రాతః స్మరణీయులు! ఆయన చేసిన కృషి వల్లే ఇవాళ్ల మన ప్రపంచ ప్రఖ్యాత తిరుమల ఆలయంతో సహా ఎన్నో దేదీప్యమానంగా కళకళలాడుతున్నాయి. రామానుజులు ఏర్పాటు చేసిన నియమాలే ఆయా ఆలయాల్ని ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా భద్రంగా కాపాడాయి. కాపాడుతూ వున్నాయి! అందుకే, వెయ్యేళ్లైనా ఆ మహాభాగవతుడి ప్రభావం చెక్కుచెదరటం లేదు!