ఆటోలను తగలబెట్టండి- రాజ్‌ థాకరే!

 

మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన 70,000 కొత్త ఆటోలు రోడ్ల మీద కనిపిస్తే వాటిని తగలబెట్టమని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులు కొందరు, సదరు ఆటోలను నడపడమే రాజ్‌థాకరే గారి ఆగ్రహానికి కారణమట! మహారాష్ట్రలో ఆటోను నడిపేందుకు 15ఏళ్లపాటు అక్కడే నివాసం ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ, ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా స్థానికేతరులకు లైసెన్సులను మంజూరు చేస్తోందని ఆరోపించారు రాజ్‌.

బాల్‌థాకరే మేనల్లుడైన రాజ్‌థాకరే తరచూ ఇలాంటి వ్యాఖ్యలను చేస్తూనే ఉంటారు. వీటికి ప్రభావితం అయిన ఆయన పార్టీ కార్యకర్తలు నిజంగానే హింసకు పాల్పడిన ఘట్టాలు కోకొల్లలు. శివసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంత కుంపటిని పెట్టుకున్న రాజ్‌థాకరే ఇలాంటి స్థానికపరమైన అంశాలతోనే పలు ఎన్నికలకు వెళ్లారు. కానీ మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన చెప్పుకోదగ్గ పార్టీగా ఎదగలేకపోయింది. అయినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు రాజ్‌థాకరే. అమితాబ్‌ మొదలుకొని సచిన్‌ టెండుల్కర్ వరకూ తమ కెరీర్‌లో అందరూ ఆటుపోట్లను ఎదుర్కొన్నవారేననీ, తాము కూడా ఎప్పటికైనా విజేతగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బహుశా అలాంటి విజయాల కోసమే, ఇలాంటి వివాదాలను రేకెత్తుతున్నారేమో!