పీఎస్ఎల్వీసీ-37 ఉపగ్రహాల ఉపయోగాలు...

 

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ రష్యా గతంలో 2014లో ఒకేసారి 37 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డ్ సాధించగా.. ఇప్పుడు ఇస్రో దానిని తలదన్నే ప్రయోగాన్ని చేసి చరిత్ర సృష్టించింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను  పీఎస్ఎల్వీసీ-37 ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టారు.

 

ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలివి: మొత్తం 104 ఉపగ్రహాల్లో 101 విదేశాలకు చెందినవి కాగా మూడు ఉపగ్రహాలు భారత్‌కు చెందినవి. భారత్ ఉపగ్రహాల్లో 714 కిలోల బరువు గల కార్టోశాట్ - 2, ఒక్కొక్కటి 15 కిలోల బరువు గల ఐఎన్‌ఎస్ - 1ఏ, ఐఎన్‌ఎస్ - 1బీ నానో ఉపగ్రహాలు ఉన్నాయి. ఇక అమెరికాకు చెందిన 96 (ఇందులో డవు ఉపగ్రహాలు 88, లెమర్‌ ఉపగ్రహాలు 8). ఇజ్రాయెల్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఒక్కో నానో ఉపగ్రహం ఉన్నాయి. మొత్తం నానో ఉపగ్రహాల బరువు 664 కిలోలు.

 

భారత్ ఉపగ్రహాల ఉపయోగం.....

 

భూ ఉపరితల పరిస్థితుల అధ్యయనానికి కార్టోశాట్ - 2 ఉపయోగపడుతుంది. కార్టోశాట్ - 2 ఉపగ్రహం భూ ఉపరితలం పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. ఇది కోస్తా తీరం వెంబడి వినియోగానికి అనువైన భూమి, నియంత్రణతోపాటు రోడ్ నెట్‌వర్క్ పర్యవేక్షణ, జలాల పంపిణీ తదితర అంశాలపై అధ్యయనం చేస్తుంది. ముఖ్యంగా అందులో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్‌ మల్టీ స్ప్రెక్ట్రల్‌ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన చాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీర ప్రాంతపు భూములు, మ్యాప్‌లు తయారు చేయడం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం, సాగునీటి పంపిణీ, రోడ్లు గురించిన సమాచారాన్ని క్షుణ్ణంగా అందిస్తుంది. ఈ ఉప గ్రహ చిత్రాలు ఆధారంగా పట్టణాభివృద్దిని చేసుకోవడానికి వీలుకలుగుతుంది. భూమి మీద జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. దీని జీవిత కాలం ఐదేండ్లు.

 

నానో ఉపగ్రహాల ప్రయోగ లక్ష్యం

 

ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్ - 2 కు అనుబంధంగా సేవలందించేందుకు వీలుగా ఇస్రో.. ఐఎన్‌ఎస్ - 1ఏ, ఐఎన్‌ఎస్ - 1బీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నది. అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ వారు ఈ రెండు చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేశారు. ఇస్రో పేలోడ్స్ టెక్నాలజీ ప్రదర్శనకు గల అవకాశాలు సృష్టించడంతోపాటు డిమాండ్ మేరకు ఉపగ్రహాల ప్రయోగానికి అవకాశాలు కల్పించడమే ఇస్రో నానో ఉపగ్రహాల (ఐఎన్‌ఎస్) ప్రాథమిక లక్ష్యం. పేలోడ్స్‌గా సర్ఫేస్ బై డైరెక్షనల్ రిఫ్లెక్టెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రేడియో మీటర్‌ను ఐఎన్‌ఎస్ 1ఏ.. ఎర్త్ ఎక్సోస్పియర్ లైమా అల్ఫా అనలైజర్‌ను ఐఎన్‌ఎస్ - 1 బీ తీసుకెళ్తాయి.

 

ఇది కూడా రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ కావడం విశేషం. ఈ పేలోడ్‌తో భూమిమీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది. భూమి మీద రేడియేషన్‌ ఎనర్జీని మధింపు చేస్తుంది. ఇది కేవలం ఆరు నెలలు మాత్రమే పనిచేస్తుంది.

 

అమెరికా ఉపగ్రహాల ఉపయోగం

 

ఈ ప్రయోగం ద్వారా అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు క్షక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ 96 లో డవు ఉపగ్రహాలు 88, లెమర్‌ ఉపగ్రహాలు 8 ఉన్నాయి. డౌవ్‌ ఫ్లోక్‌–3పీ శాటిలైట్స్‌లో 88 చిన్న తరహా ఉపగ్రహాలుంటాయి. ఇవన్నీ ఒక బాక్స్‌లో అమర్చి ఉంచారు. ఈ బాక్స్‌ స్పేస్‌లోకి వెళ్లగానే అమెరికా అంతరిక్ష సంస్థ భూకేంద్రం వారు దీన్ని గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి ఓపెన్‌ చేయడంతో అందులో వున్న 88 ఉపగ్రహాలు స్పేస్‌లోకి వస్తాయి. వీటి ద్వారా వాణిజ్యపరమైన, వాతావరణ సంబంధమైన సమాచారాన్ని ప్రతి రోజు తెలియజేస్తాయి.

 

ఇక లీమూర్‌ ఉపగ్రహాల వ్యవస్థలో మొత్తం 8 ఉపగ్రహాలుంటాయి. వీటిని కూడా ఓపెన్‌ చేసిన తరువాత పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇవి కూడా భూమికి సంబంధించిన సమాచారాన్నే అందిస్తాయి.
 

 

విదేశీ ఉపగ్రహాల ఉపయోగం..

 

ఇజ్రాయెల్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఒక్కో నానో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. నెదర్లాండ్‌కు చెందిన 3 కేజీల బరువైన  పీయాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 బీజీయూ శాట్, కజికిస్తాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్‌–ఫరాబి–1, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల బరువు కలిగిన నాయిప్‌ అనే ఉపగ్రహాలు కూడా టెక్నాలజీ డిమానుస్ట్రేషన్‌కు ఉపయోగించారు. చిన్న చిన్న అప్లికేషన్స్‌ తయారు చేసేందుకు ఈ చిన్న తరహా ఉపగ్రహాలను వినియోగించారు.