TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంగళగిరి రైల్వే స్టేషన్.. 17న ప్రారంభించనున్న ప్రధాని మోడీ.!

Published on: Wed Jul 15, 2026 8:16AM

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మంగళగిరిలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మంగళగిరి రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 17న వర్చువల్ గా ప్రారంభించనున్నారు.  

కేంద్ర ప్రభుత్వం ఈ ఆధునీకరణ పనుల కోసం   12.56 కోట్ల నిధులను వెచ్చించింది. ఎన్ఎస్జీ 4 కేటగిరీకి చెందిన ఈ రైల్వే స్టేషన్, రాజధాని అమరావతి ప్రాంతానికి అత్యంత కీలకమైన రవాణా కేంద్రంగా సేవలందించనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ స్టేషన్ రూపురేకలను పూర్తిగా మార్చేసింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు వీలుగా నూతనంగా రెండో ఎంట్రీ గేట్‌ను (సెకండ్ ఎంట్రీ) నిర్మించారు. స్టేషన్ ముఖద్వారాన్ని ఆకర్షణీయమైన డిజైన్‌తో పునర్నిర్మించారు. ప్రయాణికుల కోసం అత్యాధునిక బుకింగ్ కార్యాలయం, విశాలమైన వెయిటింగ్ హాల్స్, ఎయిర్ పోర్టు తరహాలో వీఐపీ లాంజ్, ఆధునిక శౌచాలయాలు, సౌకర్యవంతమైన సీటింగ్ వసతులను కల్పించారు.
ప్లాట్‌ఫారమ్ నంబర్ 1, 4లపై నూతనంగా భారీ షెల్టర్లను నిర్మించడంతో పాటు ప్లాట్‌ఫారమ్ ఉపరితలాన్ని ఆధునీకరించారు. ప్రయాణికులకు సులభంగా దారి చూపేలా స్పష్టమైన  ఎల్ఈడీ డిస్‌ప్లేలు, సూచికలు  అమర్చారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం స్టేషన్‌లో ప్రత్యేకంగా రెండు లిఫ్టులు, ర్యాంపులు,  అంధుల కోసం ప్రత్యేక నడక మార్గం  అందుబాటులోకి తెచ్చారు.

అలాగే.. స్టేషన్ పరిసర ప్రాంతాలను పచ్చటి ల్యాండ్‌స్కేపింగ్‌తో సుందరంగా మార్చారు. విశాలమైన కార్, బైక్ పార్కింగ్ సౌకర్యాలు, పాదచారుల మార్గాలు,    ఎల్ఈడీ  లైటింగ్ ఏర్పాటు చేశారు.  ఇక మంగళగిరి చేనేత వైభవాన్ని, ఈ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా  కళాకృతులు, గోడ చిత్రాలతో స్టేషన్ ప్రాంగణాన్ని అలంకరించారు. రాజధాని అమరావతి ప్రాంతానికి నేరుగా కనెక్టివిటీ ఇచ్చే ఈ స్టేషన్ ఆధునీకరణ ద్వారా ప్రయాణికులకు ఉత్తమ సేవలందడమే కాకుండా..  రైళ్ల రాకపోకల నిర్వహణ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.   

 Mangalagiri railwat station, July17th, Virtuval, amenities, Viplaunge