మోడీకి అమెరికా ఆహ్వానం.. వస్తానన్న మోడీ!

 

 

 

అగ్రరాజ్యం అమెరికా భారత ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించింది. గతంలో మోడీకి వీసా నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోడీ దేశానికి ప్రధాని కాగానే అర్జెంటుగా ఆహ్వానించేసింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి వచ్చే సెప్టెంబర్‌లో ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాతో శిఖరాగ్ర సమావేశాన్ని జరుపుతానని మోడీ వర్తమానం పంపారు. మామూలుగా అయితే న్యూయార్క్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సమావేశాలకు మోడీ వెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లో మన ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలవడం సాధారణంగా జరిగేదే. కానీ, అందుకు భిన్నంగా ఈసారి వాషింగ్టన్‌లో ఇరు దేశాల అధినేతలూ శిఖరాగ్ర సమావేశం జరపబోతున్నారు. 2005లో అమెరికా నరేంద్రమోడీకి ఉన్న వ్యక్తి గత వీసాను రద్దుచేయడంతోపాటు ఆయనకు దౌత్యపరమైన వీసాను నిరాకరించింది. అప్పుడు చేసిన తప్పును అమెరికా మోడీని ఆహ్వానించడం ద్వారా దిద్దుకుంది.