TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూటమిలో పిఠాపురం రచ్చ.. చంద్రబాబు గరం.. పవన్ కల్యాణ్ మౌనం!

Published on: Thu Apr 23, 2026 5:27PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా మారిన పిఠాపురంలో కూటమి నేతల మధ్య విభేదాలు మళ్లీ  రచ్చకెక్కాయి. ఇటీవల ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంతో  నియోజవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్  ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాస్తా జనసేన నేత పాండెం దొరబాబుతో వాగ్వివాదానికి, భౌతిక దాడుల  యత్నానికి దారితీసింది. 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ  అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.

అయితే..  వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనం వహించడం   చర్చనీయాంశంగా మారింది. తన సొంత నియోజకవర్గంలో రెండోసారి ఇలాంటి గొడవలు జరుగుతున్నా..  పవన్ తన పార్టీ నేతలను మందలించకపోవడం, కనీసం పునరావృతం కాకుండా వ్యవహరించాలని సూచన కూడా చేయకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  చంద్రబాబు తన సొంత పార్టీ నేతను మందలించి కూటమి ఐక్యతను కాపాడే ప్రయత్నం చేస్తుంటే..  పవన్ ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న  తలెత్తుతోంది. 

గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వర్మకు సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ పీఠాపురంలో వర్మకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో మరో ప్రత్యామ్నాయ శక్తి ఎదగకుండా జనసైనికులు చెక్ పెడుతున్నారా? అందుకు పవన్ కల్యాణ్ ప్రోత్సాహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

ఒక పక్క నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఉండాలని తెలుగుదేశం శ్రేణులు ప్రయత్నిస్తుంటే.. జనసేన నేతలు మాత్రం ప్రోటోకాల్ విషయంలో పట్టుదలకు పోతున్నారు. తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికైనా  చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి.. ఇటువంటి గొడవలకు చెక్ పెట్టకుంటే..  పిఠాపురంలో కూటమి పార్టీల ఐక్యత ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.