TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అధికార, ప్రతిపక్షాల ఐక్యరాగం

Published on: Sat Feb 21, 2015 9:36PM

 

ఈ నెల 23 నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. దానిని దృష్టిలో పెట్టుకొని దేశంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగి తేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకి ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేసింది. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ పల్లవి ఎత్తుకొన్నారు. అదికాక విభజన బిల్లులో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను, నిధుల విడుదలలో జాప్యం గురించి వారు కేంద్రాన్ని పార్లమెంటులో నిలదీయనుంది. తెదేపా దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైకాపా కూడా అదే అంశాలు లేవనెత్తవచ్చును. కనుక రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటిసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్ర ప్రయోజనల కోసం పార్లమెంటులో మాట్లాడబోతున్నాయి.

 

అయితే కాంగ్రెస్, వైకాపాలు నేరుగా ఎన్డీయే ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిలదీస్తుంటే, బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న తెదేపా వాటికి వంతపాడలేదు. అలాగని అవి పోరాడుతుంటే సభలో తెదేపా మౌనంగా కూర్చొన్నా ఆ తరువాత విమర్శలకు గురికాక తప్పదు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం శనివారం నాడు జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై ఎంపీలతో చంద్రబాబు చర్చించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్యాకేజీలు రాబట్టుకోవడానికి ప్రయత్నిచాలని అన్నారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా మసులుకోమని చంద్రబాబు నాయుడు తన యంపీలను ముందే హెచ్చరించారు. కనుక తెదేపా యంపీలకు ఈసారి సభలో చాలా లౌక్యంగా, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

 

ఇక తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రం నుండి అధనపు విద్యుత్ సరఫరా, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకి జాతీయ హోదా, విభజన సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరి తదితర అంశాలను కాంగ్రెస్ లేవనెత్తవచ్చును. మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా సవరణ చేయదాన్ని తీవ్రంగా తప్పుపడుతూ రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంత రావు శనివారంనాడు ఇందిరాపార్క్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేసారు. దానికి టీ-కాంగ్రెస్ నేతలు అందరూ తరలి వచ్చేరు. అంటే ఈ టీ-కాంగ్రెస్ యంపీలు ప్రధానంగా ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకొని మోడీ ప్రభుత్వంపై సభలో యుద్ధం ప్రకటించబోతున్నారని స్పష్టం అవుతోంది.