పెట్టె తెరిచారు... ఊసూరుమన్నారు...


పెట్టె తెరిచారు... ఊసూరు మన్నారు. పెట్టె తెరవడం ఏంటి..? ఉసూరు మనడం ఏంటునుకుంటున్నారా..? ఆ కహాని ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాల్సిందే. తెలంగాణ‌లోని వికారాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి తనకు వారసత్వంగా వచ్చిన ఇల్లుని అమ్మేశాడు. ఆ ఇంటిని ఓ వ్యక్తి కొనుగోలు చేసి.. అక్కడ కొత్త ఇంటిని నిర్మించాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే.. కొత్త ఇంటి నిర్మాణం కోసం పునాదులు త‌వ్వుతుండ‌గా.. ఓ భారీ పురాత‌న పెట్టె భ‌వ‌న నిర్మాణ కార్మికుల కంట్లో ప‌డింది. ఇంకేముంది ఆ పెట్టె వార్త క్షణాల్లో అందరకి చేరింది. గుప్త నిధులు దొరికాయంటూ పుకారు చెల‌రేగింది. అది ఈ నోటా.. ఈనోటా పాకి ఆఖరికి పోలీసుల వరకూ చేరింది. పోలీసులు అక్కడికి చేరుకొని..క‌ట్టుదిట్టంగా ఆ పెట్టెను బ‌య‌టికి తీశారు. పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అక్క‌డి నుంచి త‌హ‌శీల్దారు కార్యాల‌యానికీ తీసుకెళ్లారు. దీంతో చుట్టు పక్కల ప్రజలంతా ఆతృతతో తహశీల్దార్‌ కార్యాలయానికి చేరారు. ఆఖరికి సమయం రానే వచ్చింది. ఊపిరి బిగ‌బ‌ట్టి పెట్టెను తెరిచి చూశారు. ఉసూరు మ‌న్నారు. ఆ పెట్టెలో ఏంలేదు..ఖాళీ పెట్టె. పాపం మొత్తానికి పెట్టెలో ఏ నిధి నిక్షేపాలు ఉంటాయో అనుకున్నారు... కానీ మొత్తం సీన్ రివర్స్ అయింది.