మొదలైన తొలి సమరం

 

panchayati elections, AP panchayat elections,  Gram Panchayat elections

 

 

మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ మంగళవారమే జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. రెండు గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత వార్డుల ఓట్లు లెక్కించి ప్రకటిస్తారు. బ్యాలెట్ పేపరుపై జరగనున్న ఈ ఎన్నికల్లో 1.25 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మొదటి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. వేలం జరిగిన 18 పంచాయతీల్లో ఎన్నికలు రద్దు చేశామని, వాటికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.

 

ఇక, తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల పరిధిలో 5803 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి, ఈనెల మూడో తేదీన మొదటి విడతలో 6,863 సర్పంచి, 69,450 వార్డు పదవులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 683 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.



భారీ వర్షాలు, వరదల కారణంగా మొదటి విడతలో జరగాల్సిన 237 పంచాయతీల్లో ఎన్నికలను మూడో విడతకు వాయిదా వేశారు. వీటితోపాటు 48 వేల వార్డులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవులకు బరిలో నిలిచిన సుమారు 17 వేల మంది, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తున్న దాదాపు లక్ష మంది భవితవ్యం మంగళవారం తేలిపోనుంది. వర్షాల కారణంగా భద్రాచలం డివిజన్లో ఎన్నికలను వాయిదా వే యడంతో మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో అసలు పంచాయతీ ఎన్నికలే జరగడం లేదు. లక్ష మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.