5 లక్షల తలరాతలు మార్చేసిన మహిళ

 

డా॥ కిరణ్ మార్టిన్ పిల్లల వైద్యురాలు. ఓసారి ఆమె దక్షిణ దిల్లీలోని ఓ మురికివాడలోకి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందు ఎప్పుడూ ఆమె మురికివాడల్లోకీ, అందులోని పూరిగుడిసెలలోకీ అడుగుపెట్టనే లేదు. దాంతో అక్కడ తనకి కనిపించిన దృశ్యానికి కిరణ్కు మతిపోయినంత పనయ్యింది. మురికివాడల్లోని పిల్లలు ఎక్కడ పడితే అక్కడ మలవిసర్జన చేస్తున్నారు. గుడిసెలలో ఇంతెత్తున చెత్త పేరుకుపోయి ఉంది. ఆ చెత్తలోనే పసిపిల్లలు ఆడుకుంటున్నారు. వారు తాగే నీరు పరమ మురికిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం సంగతి చెప్పేదేముంది? వాడవాడంతా కలరాతో బాధపడుతోంది. ఆ మహమ్మారిని తప్పించుకునే పరిస్థితి కానీ, కలరా సోకిన తరువాత వైద్యం చేయించుకునే స్తోమత కానీ వారికి లేవు.

 

 

మురికివాడలో పరిస్థితిని చూసి కిరణ్ చలించిపోయారు. తను వారికి ఉచితంగా వైద్యం చేయాలని అనుకున్నారు. వెంటనే ఓ చెట్టు కింద కలరా రోగులకు ఉచితంగా వైద్యం చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఒకరిద్దరి సహకారంతో ఆ మురికివాడలోనే ఒక చిన్న ఇంట్లో క్లినిక్ను తెరిచారు. మరో అడుగు ముందుకు వేసి ఆ మురికివాడలోని జీవితాలను బాగుచేసేందుకు ‘ఆశా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఇదంతా 1990 నాటి పరిస్థితి. ఆ తరువాత ‘ఆశా’ దిల్లీ మురికివాడల తీరునే మార్చివేసింది. అదంతా మరో కథ!

 

 

 

ఆశా ప్రారంభంలోనే డా॥ కిరణ్ మురికివాడల్లోని ఆడవారిని భాగస్వాములుగా చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటివరకూ ఎంతోమంది తియ్యటి మాటలు విని మోసపోయిన వారు... ఆమెను అంతగా నమ్మలేదు. క్రమేపీ కిరణ్ అంకితభావం, నిస్వార్థంగా వైద్యం చేస్తున్న విధానం చూసి దగ్గరయ్యారు. తాగే నీరు అన్న మాటే ఎరగని ఆ వాడలో కిరణ్ మంచినీటిని ఏర్పాటు చేయడంతో ఆమెకు అనుసరించేంత నమ్మకం ఏర్పడింది. ఆడవారి సంగతి అలా ఉంచితే మగవారు మాత్రం కిరణ్కు సహకరించలేదు సరికదా... ఆమెను వేధించే ప్రయత్నం చేశారు. కిరణ్ వారిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోయేవారు. పైగా మగవారిలోని అభద్రతా భావాన్ని తొలగించేందుకు,  ‘ఆశా’ సమావేశాలకి వారిని కూడా ఆహ్వానించేవారు. అలాంటి వ్యక్తిత్వానికి లొంగనివారుంటారా!

ఇప్పుడు దిల్లీలోని మురికివాడల్లో ‘ఆశా’ గురించి తెలియనివారు ఉండరు. ఆశాలో శిక్షణ పొందిన కార్యకర్తలు సాధారణ అనారోగ్యాలన్నింటికీ చికిత్స చేసేందుకు సన్నద్ధంగా ఉంటారు. వాడవాడలా క్వాలిఫైడ్ వైద్యులు, నర్సులతో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆశా కేవలం దక్షిణ దిల్లీలోని ఒక మురికివాడకే పరిమితమైన సంస్థ కాదు! దిల్లీ అంతటా 60 మురికివాడల్లో ఉన్న ఐదు లక్షలమంది జనాలని ప్రభావితం చేసే ఓ ఉద్యమం. అందుకే ఆశా ఆవిర్భవించిన తరువాత దిల్లీ మురికివాడల్లో శిశు మరణాలు, అంటువ్యాధులు, పోషకాహార లోపాలు వంటి సవాలక్ష ఆరోగ్య సమస్యలు గణనీయంగా తగ్గిపోయాయి.

 

 

ఆశా కేవలం పేదల అనారోగ్యాన్ని దూరం చేసేందుకే ప్రయత్నించదు. ఆ అనారోగ్యానికి కారణమైన నిరక్షరాస్యత, పేదరికాలను కూడా రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. సేవింగ్స్ ఖాతాలను ఎలా తెరవాలి? బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఎలా? వ్యాపారం కోసం ఎలాంటి రణాలు లభిస్తాయి? లాంటి విషయాల మీద అవగాహన కల్పించడం ద్వారా కొందరి ఆదాయం అమాంతం పదిరెట్లు పెరిగిపోయిందట! ఇక మురికివాడల్లోని తెలివైన కుర్రకారుకి ఉన్నత విద్యావకాశాలు కల్పించడం మరో ఎత్తు. ఇలా దాదాపు 1200 మంది మురికివాడ విద్యార్థులు దిల్లీ యూనివర్శిటీ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలలో అడుగుపెట్టగలిగారు.

ఇదీ కిరణ్ కథ! ‘నేను ఒక్కదాన్ని. ఆడమనిషిని. మురికవాడల్లో అంతా మొరటుజనాలు, మురికి మనుషులు.’ అని కిరణ్ అనుకొని ఉంటే.....

- నిర్జర.