తెలుగు రాష్ట్రాలలో విపక్షాల సెల్ఫ్ గోల్ రాజకీయం.!
Published on: Fri Sep 18, 2026 9:28AM

తెలుగు రాష్ట్రాలలో విపక్షాలు విధ్వంస రాజకీయాలు చేస్తున్నాయన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా లేకున్నా ఉన్న ఏకైక విపక్షం వైసీపీలు అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యూహాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమతమ రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్, వైసీపీలు పట్టు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య పద్ధతులకు భిన్నంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను నిలదీయడంలో, ప్రజా సమస్యలపై పోరాడడంలో ఈ పార్టీలు అనుసరిస్తున్న పద్ధతులు విమర్శల పాలౌతున్నాయి. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే ఆయువుపట్టు. అటువంటి ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్.. హోదా లేకున్నా అదే పాత్రలో ఉన్న వైసీపీ వ్యక్తిగత ఈగో, అహంకారం, స్వార్థపూరిత అజెండాతో వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ రెండు కూడా ప్రజా సమస్యల ఊసెత్తకుండా తమ సొంత రాజకీయ అజెండాతో.. విమర్శల పేర దూషణలకు పాల్పడుతూ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయ్యేలా వ్యవహరిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ముందుగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విషయానికి వస్తే.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి దశాబ్దం పాటు అధకారంలో ఉన్న ఆ పార్టీ.. ప్రతిపక్షంగా మారి మూడేళ్లు కావస్తున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై గళం ఎత్తడం లేదు సరికదా.. ఆ పార్టీ అధినేత ఇంత వరకూ అసెంబ్లీలో గళమెత్తిన పాపాన పోలేదు. అసలు అసెంబ్లీకే హాజరు కావడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పై ఆటోమేటిగ్గా ప్రజా వ్యతిరేకత వస్తుందనీ, వస్తోందని భావిస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనన్న కలల ప్రపంచంలో ఊరేగుతున్న పరిస్థితి. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టించుకోకుండా కేవలం వచ్చే ఎన్నికలలో తిరిగి అధికారం చేపడతామన్న ఊహాలోకంలో విహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా ఈ మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రజాసమస్యలపై రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టిన దాఖలాలు లేకపోవడమే. ఇదే విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. తాము నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదనీ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై సమస్యలపై గళమెత్తడం లేదనీ బాహాటంగానే చెబుతున్నారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బీఆర్ఎస్.. అది గాలికొదిలేసి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దూషణలకు పరిమితమైంది. ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు గుప్పించడంతో సరిపెట్టేస్తోంది. సోషల్ మీడియా ట్రోలింగ్ స్ట్రాటజీలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేస్తున్నామని సంబరపడిపోతోంది. ఇదే పరిస్థితి ఇలాగే సాగితే.. బీఆర్ఎస్ రాష్ట్రంలో బలమైన పొలిటికల్ పవర్ గా ఉండే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక ఏపీలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ పార్టీకి రాజకీయంగా ఒక దశ, దిశ ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఉనికి కోసం ఆరాటం తప్ప.. ప్రజాసమస్యలపై అవగాహన కానీ, అక్కడ కానీ కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. జనం కూడా ఆ పార్టీ ప్రకటనలూ, మీడియా సమావేశాలలో చేసే వ్యాఖ్యలు తమకు ఏమాత్రం సంబంధం లేనివిగా భావించే పరిస్థితికి వచ్చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఏమిటి? ఏ సమస్యపై తాము గళమెత్తితే జనంలో స్పందన ఉంటుంది? అన్న విషయాన్ని గుర్తెరకుండా వైసీపీ అగ్రనాయకత్వం లేని సమస్యలను లేవనెత్తి ప్రజలలో పలుచన అవుతున్నది. కేవలం ఉనికిని చాటుకోవడానికి ఏదో ఒక హడావుడి చేస్తూ కాలక్షేపం చేస్తున్నట్లుగా వైసీపీ తీరు ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.
ఇక వైసీపీ అధినేత.. తాను మరోసారి పాదయాత్ర చేస్తే చాలు 2019 నాటి విజయం పునరావృత మౌతుందన్న భ్రమలో ఉన్నట్లు కనిపిస్తున్నది. అయితే అప్పటి వరకూ పార్టీ శ్రేణులలో తన నాయ కత్వంపై నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు శూన్యం అంటున్నారు. అసలు ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో, ప్రజలకు చేరవ అవ్వడంలో అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి? ఏ అంశాలపై మాట్లాడితే జనానికి చేరువ అవుతామన్న స్పష్టత పార్టీ అధినేతలో కొరవడటమే ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసి.. ప్రజలు స్వాగతిస్తున్న రాజధాని అమరావతిపై బురద జల్లడం, ఐదేళ్లు అధికారంలో ఉండగా ఒక్క డీఎస్సీ నిర్వహించని వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి సర్కార్ హయాంలో జరుగుతున్న డీఎస్సీలను విమర్శించడం వైసీపీని జనాలకు దూరం చేస్తున్నది. పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్న ఈ విధానాల కారణంగా క్యాడర్ కూడా ప్రజల ముందుకు వెళ్లలేక ముఖం చాటేస్తోంది. మొత్తంగా వైసీపీకి తాను లేవనెత్తుతున్న అంశాలపై కానీ, లేవనెత్తాల్సిన సమస్యలపై కానీ అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కూడా ఆయా రాష్ట్రాలలోని విపక్షంపై ప్రజలలో విశ్వాసం, నమ్మకం పెరగడం అటుంచి సన్నగిల్లుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్, వైసీపీలు తన తీరు మార్చుకుని క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై వారితో కలిసి గళమెత్తకుంటే.. రాజకీయంగా కోలుకోలేని విధంగా నష్టపోవడం ఖాయమని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం విపక్షాలు అనుసరిస్తున్న విధానం సెల్ఫ్ గోల్ రాజకీయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
[opposition Parties In Telugu States, Brs politics, YCP politics, Telugu states politics, r Telangana, Andhra Pradesh, Telugu One]


