కాంగ్రెస్ 60 ఏళ్లిచ్చారు..నాకు 60 నెలలు: మోదీ

 

 

 

దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ ముగింపు సమావేశంలో నరేంద్రమోదీ కీలకోపన్యాసం చేశారు. కాంగ్రెస్ యువతనేత రాహుల్ గాంధీపైన, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ విధానాలపై విమర్శనాస్త్రాలను సంధించారు. ''60 ఏళ్లు ఆ నాయకులకిచ్చారు..60 నెలల ఈ సేవకుడికివ్వండి'' అని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.

 

రాహుల్ పేరెత్తకుండానే ఆయనపైనా, గాంధీ కుటుంబంపైనా ధ్వజమెత్తారు. కేవలం తమ ఇంటి పేరుతో గొప్పవాళ్లు (నామ్‌దార్)గా చలామణీ అయ్యేవాళ్లు తమ తమ పనుల ద్వారా ప్రఖ్యాతి గాంచిన కృషీవలుడి (కామ్‌దార్)తో పోటీ చేయడాన్ని అవమానంగా భావిస్తారని విమర్శించారు. " నా తల్లి ఇంటి పని చేసేది. నేను రైల్లో టీ అమ్ముకునే వాడిని. ఇలాంటి కిందిస్థాయి నుంచి వచ్చిన నాలాంటి వ్యక్తితో పోటీ చేయడం రాహుల్‌కు ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అది తనకు అగౌరవంగా ఆయన భావించి ఉండొచ్చు'' అని ఎద్దేవా చేశారు.



ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరల పెరుగుదలను అరికడతానని చెప్పారు. అడ్డూ అదుపు లేకుండా ఉన్న ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానన్నారు. పేదరికాన్ని నియంత్రిస్తానని చెప్పారు. ఈ మూడింటి విషయంలోనూ తన ఆలోచనలను వివరించారు. మాజీ ప్రధాని వాజపేయి మానస పుత్రిక అయిన నదుల అనుసంధాన కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ కలల ప్రాజెక్టు అయిన విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని భారత్‌కు తీసుకు రావడమనే కలను నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. ఆ డబ్బును పేదల సంక్షేమానికి ఉపయోగిస్తానని అన్నారు.