వైయస్ జగన్ కు నారా లోకేష్ సవాల్

 

 

 

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి నారా లోకేష్ సవాల్ విసిరారు. తెలుగుదేశం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పై చర్చకు సిద్దమని, జగన్మోహన్ రెడ్డి తమ సవాలు స్వీకరించడానికి సిద్దమేనా? అని లోకేష్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతకీ బెయిలు దొరకకపోవడంతో చివరికి సోనియా గాంధీని బ్రతిమాలుకొని బెయిలు తెచ్చుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తే, దానిని ఆ తరువాత వచ్చిన వైయస్సార్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయని విమర్శించారు.

 


తెదేపా ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టేనాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదని, చంద్రబాబు కృషితో ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచగలిగారని తెలిపారు. విద్యుత్ ఉంటేనే పరిశ్రమలు, పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయని గ్రహించిన తెదేపా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి రంగానికి పెద్ద పీట వేసిందని ఆయన అన్నారు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడి పరిశ్రమలు మూతపడుతున్నాయని, తత్ఫలితంగా మళ్ళీ నిరుద్యోగ సమస్య తీవ్రం అయ్యిందని తెలిపారు.



తెదేపాను నిత్యం విమర్శించే కేసీఆర్, తెదేపా ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మని చంద్రబాబు సవాలు విసిరితే తన ఫాంహౌస్ లోకి దూరి దాకోన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.