TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పీవీ సింధుతో షటిల్ ఆడిన మంత్రి లోకేష్

Published on: Fri Apr 17, 2026 5:07PM

 

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధికి ఊపందించే దిశగా మంత్రి నారా లోకేష్ కీలక అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్టార్ పీ.వి. సింధుతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడి ఆకట్టుకున్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ సరదా మ్యాచ్‌లో లోకేష్ చురుకైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తిరుపతి గొల్లవానిగుంటలో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన అనంతరం, లోకేష్ క్రీడాకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. క్రీడాకారులు, నిపుణుల సూచనలు తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. రాయలసీమను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతానన్న హామీ త్వరలో కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, అర్జున అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, అథ్లెట్ యర్రాజీ జ్యోతి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్తో పాటు పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు.

అలాగే బ్లైండ్ క్రికెట్, పారా స్పోర్ట్స్, చెస్, ఆర్చరీ, హాకీ, ఖోఖో వంటి విభిన్న క్రీడల ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. క్రీడాకారుల సూచనలన్నింటినీ డాక్యుమెంటేషన్ చేసి, 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, ప్రతిభకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.