కిరణ్ పై హరీష్ పిల్

 

 

 

నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుండి చిత్తూరు జిల్లా తాగునీటి పథకానికి రూ.4,300 కోట్లు కేటాయించడాన్ని తప్పుపడుతూ టీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చిత్తూరు తాగునీటి పథకానికి నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ గత అక్టోబర్ 10న జారీచేసిన 14,15 జీవోలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని ఆయన తన పిటీషన్ లో న్యాయస్థానాన్ని కోరారు.


కేవలం ఎన్నికలలో లబ్దిపొందేందుకు ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు నిధులు తరలించుకెళ్లారని, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయవద్దని తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినప్పటికి జీవోలు జారీ చేసి పనులు కూడా మొదలు పెట్టారని తెలిపారు. ఈ జీఓలను వెంటనే సస్పెండ్ చేయాలని, పనులు జరగకుండా స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, గ్రామీణ నీటిపారుదల శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. ఇక నెల్లూరు నీటిని అక్రమంగా తరలించడం మీద ఇప్పటికే అక్కడ నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు గనక కోర్టు పనులు నిలపాలని ఆదేశాలు ఇస్తే ముఖ్యమంత్రికి ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతాయి.