మీడియాది బాధ్యతారాహిత్యం.. సీజేఐ.!
Published on: Fri Jul 24, 2026 3:13PM

విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు లాఠీచార్జీ, దాష్టీకం, దౌర్జన్యాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందంటూ వస్తున్న వార్తలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ అంశంపై సుప్రీం కోర్టులో రిట్ పిటీషనే దాఖలు కాలేదని పేర్కొన్న ఆయన దాఖలు కాని పిటిషన్ ను విచారణకు స్వీకరించకుండా నిరాకరించడమేంటని నిలదీశారు. మీడియా అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించిందంటూ ఫైర్ అయ్యారు.
సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. డిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై దాఖలైన పిటిషన్ ను పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయని పేర్కొన్న ఆయన మీడియా బాధ్యతారాహిత్యంగా ఇటువంటి కథనాలను వండివార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల ఉక్కుపాదానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేశారు.
కేవలం లేఖ రూపంలో వచ్చిన ఒక వినతిపత్రాన్ని రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణిస్తామన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఎవరో పంపిన లేఖ ఆధారంగా న్యాయస్థానం విచారణకు నిరాకరించిందని ప్రచారం చేయడం సరికాదన్నారు.
ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్, బాష్పవాయుగోళాలు ప్రయోగించారనే ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని, వీడియో ఆధారాలను పరిశీలించాలని ఒక న్యాయవాది మౌఖికంగా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, మెన్షనింగ్ సమయంలో వీడియోలు చూసేందుకు తమ వద్ద సమయం లేదని ధర్మాసనం పేర్కొంది. సరైన నియమావళి ప్రకారం పిటిషన్ దాఖలు కాకుండానే, సీజేఐ కేసును తిరస్కరించారంటూ వార్తలు రావడంతో సీజేఐ ఈ వివరణ ఇచ్చారు.
CJI Surya Kant, Supreme Court Police Brutality Petition, Reckless Media Reporting


