తండ్రి ఆస్తులే కాదు అప్పులూ తీర్చాలి...

 

తండ్రి ఆస్తులు అతని మరణానంతరం తన వారసులకు వెళతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆస్తులను పంచుకునే వారసులు ఆప్పులు పంచుకుంటారా..? ఆస్తుల కోసం ఆశగా ఎదురచూసే వారసులు...తమ తండ్రి చేసిన అప్పులు తీరుద్దామని ముందుకు వస్తారా..? ఆస్తుల కోసం వస్తారు.. అప్పులకోసం అంటే మాకు సంబంధం లేదు అని నిర్మొహమాటంగా అనే రోజులు ఇవి. అలాంటి వారికోసం మద్రాస్ హైకోర్టు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తండ్రి ఆస్తులతో పాటు అప్పులను కూడా వారసులు తీర్చాలని స్పష్టం చేసింది.

 

చెన్నైలోని ఒక కేసులో జడ్జి ఈ రకమైన తీర్పునిచ్చారు. అసలు సంగతేంటంటే... ఆగస్టు 26, 2001న మరణించిన నరసింహన్ వారసురాలు ఆదిలక్ష్మీకి రూ.10 లక్షల పరిహారాన్ని చెల్లించాలంటూ ఆగస్టు 21, 2017న చెన్నై కార్పొరేషన్ జారీ చేసిన ఆదేశాన్ని సవాలు చేస్తూ ఎ.రవిచంద్రన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ మేరకు వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి తమ తండ్రి ఎప్పుడో పరిహారం చెల్లించాడని పిటిషనర్ వాదించాడు.నిజానికి ఘటన జరిగిన తర్వాత 15 ఏళ్ల వరకు ఆదిలక్ష్మీ మౌనంగానే ఉన్నదని, కానీ 2016లో చెన్నై కార్పొరేషన్ ఆమె తరపున నష్టపరిహారం కోరిందని, ఇదంతా తర్వాత పుట్టిన ఆలోచన అని పిటిషనర్ వాదించాడు. అందువల్ల కార్పొరేషన్ ఆదేశాన్ని కొట్టివేయాలంటూ ఆయన కోర్టును కోరారు. కానీ, కోర్టు ఆయన విన్నపాన్ని తోసిపుచ్చుతూ మరో రెండు నెలల్లో మొత్తం పరిహారాన్ని బాధిత కుటుంబానికి చెల్లించాలని స్పష్టం చేసింది. మరి నిజంగానే ఇలాంటి చట్టాలు కూడా వస్తే వారసులు ఇకపై ఆస్తులకు కూడా ఆశపడరేమో.