పశ్చిమగోదావరి నియోజకవర్గాల్లో 'సారా' ప్రవాహం
Published on: Thu Jun 7, 2012 4:27PM
ఒకప్పుడు రాజమండ్రి కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లాకు నాటుసారా తరలివెళ్లేది. ఇప్పుడు నర్సాపురం, పోలవరం ఉప ఎన్నికల పుణ్యమా అని నేరుగా నియోజకవర్గాల్లోనే సారా కేంద్రాలు వెలుస్తున్నాయి. రెడీమేడ్ గా దొరికే పులిసిన బెల్లం ఊటను కొనుగోలు చేసి మరీ సారా కాస్తున్నారని తెలుస్తోంది. ఈ నల్లబెల్లం ఊటను తూర్పుగోదావరి సబ్ ప్లాన్ ఏజెన్సీ ఏలేశ్వరం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల ను౦చి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకూ సుమారు రెండు లక్షల లీటర్లు బెల్లం ఊటను ఎక్సయిజ్ సిబ్బంది ఈ రెండు నియోజకవర్గాల్లో దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. పోలవరం నియోజకవర్గంలో ఓటర్లను ఎక్కువగా సారా ప్రభావితం చేస్తుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ నియోజకవర్గ ఓటరును సారాతో లొంగదీసుకోవాలని అభ్యర్థులు ఉబలాటపడుతున్నారు. అయితే ఇటీవల ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఓటర్ల కోసం నిల్వ ఉంచిన 5వేల మద్యం బాటిళ్లనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంత నిఘా ఉన్నా ఈ రెండు నియోజకవర్గాలకూ సబ్ వేలు ఉన్నాయని భౌగోళిక పరిశీలనలో అర్థం అవుతోంది. అందువల్ల సారా తయారీదార్లు ఈ దారుల్లోనే నల్లబెల్లం ఊటను తెచ్చుకుని సారా కాచేస్తున్నారట. ఈ దారులతో బొత్తిగా పరిచయం లేని సిబ్బంది ఎక్సయిజ్ శాఖలో ఉన్నందు వల్ల ఈ ఉప ఎన్నికలు పుణ్యమా అని ఓటరు సారా నిషాలో మునగటం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


