కొండచరియ దుర్ఘటన: శిథిలాల్లోనే 100 మంది

 

గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పుణె జిల్లాలోని మలిన్ గ్రామంలో కొండ చరియ విరిగిపడటంతో ఇప్పటి వరకు 25 మంది మృతదేహాలను వెలికి తీశారు. మలిన్ గ్రామం మొత్తం కొండ చరియ కింద, బురద కింద చిక్కుకుపోవడంతో దాదాపు 100 మంది గ్రామస్థులు కొండ చరియ కింద చిక్కుకుని పోయారని తెలుస్తోంది. వీరిని రక్షించడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుండపోత వర్షాలతో ఆ ప్రాంతమంతా బురదమయం కావడంతో సహాయచర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు జాతీయ విపత్తు సహాయక దళం సభ్యులు 15 మందిని కాపాడారు. మొత్తం 44 ఇళ్లకు సంబంధించిన వారు శిథిలాల కింద చిక్కుకుని వున్నారు. కొండ చరియ శిథిలాలు, మట్టి కింద 100 మంది కూరుకుపోయి 24 గంటలు దాటిపోవడంతో మట్టి, బురద కింద చిక్కుకున్నవారు జీవించి లేరేమోనన్న భయం కలుగుతోంది.