లాలూ నిష్క్రమణతో బీహార్ రాజకీయ సమీకరణాలలో మార్పులు.

 

 

 

పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడి ఐదేళ్ళు జైలు శిక్షపడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై అనర్హత వేటుపడిన తరువాత, బీహార్ లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్ననితీష్ కుమార్ కి చెందిన జెడీ(యూ) కాంగ్రెస్ పార్టీలు పొత్తులు పెట్టుకోవడానికి సిద్దంగా ఉన్నపటికీ, లాలూపై వేటుపడిన తరువాతనే పొత్తుల విషయంలో ముందుకు సాగడం మేలనే ఆలోచనతో వేచిచూస్తున్నాయి. ఇప్పుడు ఆ పని కూడా పూర్తవుతోంది గనుక ఇక ఆ రెండు పార్టీలు పొత్తులకి సిద్దపడవచ్చును.

 

ఇక మాజీ బీహార్ ముఖ్యమంత్రి మరియు లాలూ భార్య అయిన రబ్రీ దేవి మీడియాతో మాట్లాడుతూ తన భర్త జైలుకి వెళ్ళినంత మాత్రాన్నతమ ఆర్ జె డీ పార్టీ ఏమి మూతబడబోదని, గతంలో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఏవిధంగా తాము పార్టీని కాపాడుకొన్నామో ఇప్పుడు కూడా అదేవిదంగా పార్టీని కాపాడుకొంటామని అన్నారు. అయితే లాలూ ప్రసాద్ కి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కూడా చుక్కేదురయ్యి ఐదేళ్ళు జైలు జీవితం గడపవలసి వస్తే, ఆయన పార్టీలో కీలక నేతలు, కార్యకర్తలు అందరూ సహజంగానే బీహార్ లో తిరుగులేని అధికారం సాగిస్తున్న జెడీ(యూ) లోకి జంపయిపోవడం ఖాయం. ఇది కాంగ్రెస్- జెడీ(యూ) కూటమికి కలిసివచ్చే అంశం కాగా, ఈసారి ఎలాగయినా ఎన్నికలలో బీహార్ నుండి అత్యధిక యంపీ స్థానాలు పొందాలనుకొంటున్న బీజేపీకి ప్రతికూలాంశంగా మారవచ్చును.