TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోషల్ మీడియా ఎఫెక్ట్.. ప్రధాని మోదీ దిగొచ్చారు : కేటీఆర్

Published on: Sat Aug 1, 2026 5:00PM

 

జెన్‌ జీ దెబ్బకు మోదీ అర్ధరాత్రి ఇన్‌స్టా వీడియో పెట్టాల్సి వచ్చింది..!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై  ప్రస్తుత మీడియా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న సెమినార్‌లో ‘రాజ్యాంగం – ప్రజాస్వామ్యం – పత్రికా స్వేచ్ఛ’ అంశంపై కేటీఆర్ మాట్లాడారు.

 ప్రధాని మోదీ ఎవరితోనూ పెట్టుకోకూడని నవతరంతో పోరాటానికి దిగారని, ఈ కొత్త తరానికి సమాజం పట్ల అత్యంత స్పష్టమైన అవగాహన, బలమైన బాధ్యత కట్టుబాటు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. నేటి యువతరం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సరికొత్త రీతిలో తమ నిరసన గళాన్ని వినిపిస్తూ కదం తొక్కిందని కేటీఆర్ కొనియాడారు.

 రాజ్యాంగం  ప్రజాస్వామ్యం ప్రసాదించిన స్వేచ్ఛకు ఎలాంటి అనవసర పరిమితులు విధించకూడదని సూచించిన ఆయన, సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిన సోషల్ మీడియా విప్లవమే నేడు ప్రభుత్వాల్లోనూ, సమాజంలోనూ జవాబుదారీతనాన్ని సజీవంగా ఉంచుతోందని వ్యాఖ్యానించారు. మారుతున్న కాలానికి  సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా నాయకులు, వ్యవస్థలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే చరిత్రలో కనుమరుగైపోతారని హెచ్చరించారు.

దేశంలోని ప్రధాన స్రవంతి మీడియా తీరుపై కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నేడు దేశంలోని మెజారిటీ మీడియా సంస్థలు ఏదో ఒక రాజకీయ పక్షానికి లేదా అధికార పీఠానికి వత్తాసు పలుకుతున్నాయని, నిజమైన వార్తను ఉన్నది ఉన్నట్లుగా నిష్పాక్షికంగా రాసే పరిస్థితులు దేశంలో పూర్తిగా కరువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిదర్శనంగా పలు ఉదాహరణలను ప్రస్తావించారు. 

ఒక కేంద్రమంత్రి తనయుడు పాల్గొన్న తీవ్రమైన లైంగిక దాడి ఉదంతాన్ని ఏ ప్రముఖ మీడియా సంస్థ కూడా ధైర్యంగా కవర్ చేయలేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. అలాగే లగచర్లలో తమ భూములు  హక్కుల కోసం పోరాడిన నిరుపేద రైతులపై అక్రమంగా కేసులు బనాయించినప్పుడు కూడా ఏ మీడియా ముందుకు వచ్చి నిజాలను రాయలేకపోయిందని మండిపడ్డారు. దేశంలో ఎంత పెద్ద తప్పు జరుగుతున్నా, అధికార బలం ముందు మీడియా మౌనం వహించాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు.

ఈ రకమైన మీడియా ముసుగును, సమాచార దిగ్బంధనాన్ని సోషల్ మీడియా ద్వారా నేటి యువత తలకిందులు చేస్తోందని కేటీఆర్ వివరించారు. పాతకాలపు ఆలోచనలతో వాట్సాప్‌లలో అసత్యాలు వ్యాప్తి చేసే "వాట్సాప్ అంకుల్స్" వర్సెస్ డిజిటల్ యుగంలో నిజాలను నిర్భయంగా ప్రశ్నించే "ఇన్‌స్టా పిల్లలు" (Gen Z) మధ్య జరుగుతున్న ఈ సైద్ధాంతిక పోరాటంలో అంకితభావం కలిగిన నేటి యువతే విజయం సాధించిందని ఆయన స్పష్టం చేశారు. 

రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో ఏకంగా 50 శాతం పైగా ఓట్లు ఈ జెన్ జీ (Gen Z) యువతవే కాబోతున్నాయని అంచనా వేసిన కేటీఆర్, ఈ గణనీయమైన మార్పు రాజకీయ యవనికపై కొత్త విప్లవాన్ని తెస్తుందని అన్నారు. ప్రశ్నించే తత్వంతో ముందుకు సాగుతున్న ఈ కొత్త తరం ఓటర్లే భవిష్యత్తు రాజకీయ దిశానిర్దేశం చేస్తారని, ప్రజాస్వామ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 KTR Speeches, Gen Z Voters Percentage, KTR Vs Modi, Lagacharla Farmers News, Social Media Politics Telangana, Telangana Breaking News