డైరెక్ట్ గా మోడీనే టార్గెట్... మనిషిగా మారుద్దాం..

 

ఒకపక్క ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర మంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏపీకి తాము అనుకూలంగా ఉన్నామంటూనే... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని పాడిన పాటే పాడుతుంది. దీంతో మోడీ పేరు ఎత్తితేనే ప్రస్తుతం ఏపీ ప్రజలు ఆవేశంతో ఊగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ.. చిన్నచూపు చూస్తుందన్నది ప్రతి ఒక్కరి వాదన. ఇప్పటికి చాలా మంది నేతలే మోడీపై ఈ విషయంలో విమర్శలు గుప్పించారు. తెలుగు వారంటే ఎందుకంత చులకన అని పలువురు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో ఓ సినిమా డైరెక్టర్ కూడా చేరిపోయారు. ఆయనెవరో కాదు... దర్శకుడు కొరటాల శివ. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం తీరుపై స్పందిస్తూ.. ఓ పోస్ట్ చేశాడు.  అది కూడా డైరెక్టుగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ. ఇంతకీ  శివ పెట్టిన ట్వీట్ ఏంటంటే... "ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసి, ఆయన్ను మనిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్?" అని ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సరైన సమయంలో సరైన పోస్టును పెట్టారంటూ ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, రెండు రోజుల క్రితం తన కొత్త చిత్రం ‘భరత్ అను నేను’ టీజర్‌ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్సే వచ్చింది.