ఉత్తమ్ కుమార్ రెడ్డి vs కోమటిరెడ్డి

 

రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల జరుగుతున్న మాటల యుద్దాన్ని గమనిస్తే, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది.

 

జిల్లా రాజకీయాల్లో ఎప్పటినుండో ఉన్న ముఠా పోరులు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవి పర్యటనతో ఒక్కసారి బాగ్గుమన్నాయి. వీరిద్దరి మధ్య వ్యక్తిగత మాటల యుద్ధం నడుస్తోంది. చిరంజీవిని, ఆయనను నల్గొండ పర్యటనకు ఆహ్వానించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ ఫై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడు పార్టీలు మారతారో తెలియనివాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల్లో దస్తీలు వేసుకొని ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతున్నవారు తనను విమర్సిస్తారా అంటూ ఉత్తమ్, కోమటిరెడ్డిఫై ఫైర్ అయ్యారు. తెలంగాణా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని కూడా ఉత్తమ్ వ్యాఖ్యలు చేశారు.

 

మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి అంతే స్థాయిలో సమాధానం ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం కోసం తాను రాజీనామా చేస్తే, ఆ స్థానంలో మంత్రి పదవి చేపట్టిన నేతలకు తన గురించి మాట్లాడే అర్హత లేదంటూ కోమటిరెడ్డి బదులిచ్చారు.

 

తాను పార్టీ మారనని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ బ్రోకర్లు, కాంట్రాక్టర్లు విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుతుందో మాత్రం వేచి చూడాల్సిందే.