కుమారస్వామి గద్దె దిగడం....లాంచనమే !

 

కర్నాటక అసెంబ్లీలో కుమార స్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ వాడీవేడిగా సాగుతోంది. చర్చ మొత్తం రెబెల్ ఎమ్మెల్యేల హాజరు మీదనే సాగుతుండటం పట్ల బీజేపీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వాస తీర్మానంపై ఓటు వేయడానికి సభకు వచ్చామే తప్ప కాంగ్రెస్ లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ పై చర్చించడానికి కాదని బీజేపీ సభ్యులు చెప్పారు. 11 గంటలకు సభ ప్రారంభమైతే ఇప్పటి వరకూ విశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రారంభం కాలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి, అధికారాన్ని లాక్కునేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును ఆయన ప్రస్తావించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని లాక్కునే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. అంతే కాక కర్ణాటకలో రామకృష్ణ గౌడ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలే జరిగాయని చెప్పారు. అప్పుడు జరిగిన ఘటనలే ఇప్పుడు పునరావృతమవుతున్నాయని అన్నారు. తాను ముఖ్యమంత్రి సీటుకే అతుక్కుపోయి ఉండనని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. ప్రజలు ఎవరిని ఆమోదిస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు. అయితే ఎంత చర్చ జరుగుతున్నా కుమార స్వామి విశ్వాస పరీక్షలో విఫలం కావడం కేవలం లాంఛనంగానే కనిపిస్తున్నది. ఎందుకంటే విశ్వాస పరీక్ష సందర్భంగా సభకు 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. గైర్హాజరైన వారిలో 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు కాగా ఇద్దరు స్వతంత్రులు, ఒక బీఎస్పీ, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. విశ్వాస పరీక్షలో గట్టేక్కాలంటే కుమార స్వామికి 103 మది సభ్యుల మద్దతు ఉండాలి. కానీ బీజేపీకి సభలో 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా సభకు హాజరయ్యారు. దీంతో ఏ విధంగా చూసినా కుమారస్వామి విశ్వాస పరీక్ష గట్టెక్కే అవకాశం లేదు. అందుకే కావాలనే చర్చను పొడిగిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కర్నాటక అసెంబ్లీ వాయిదా పడింది. స్పీకర్ లంచ్ కోసం అసెంబ్లీని మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా వేశారు. అయితే ఈ రోజు ఏమి తేలనుంది ? అనే విషయం ఆసక్తికరంగా మారింది.