కుమారస్వామి సంచలన నిర్ణయం...వారికి ఆ ఆఫర్

 

ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డితో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. బెంగళూరులోని ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. అయితే మరోపక్క రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. 

సీఎంను మార్చినా తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని వారు చెబుతున్నారు. అయితే సీఎం పదవి నుంచి వైదొలిగేది లేదని చెబుతున్న కుమారస్వామి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇరు పార్టీలకు చెందిన 13 మంది రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను కూడా వారు తిరస్కరించినట్టు సమాచారం. ఇక ఈరోజు నేడు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు. 

ఈ సందర్భంగా కొందరు మంత్రులతో రాజీనామా చేయించి, వాటిని రెబల్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజీనామాల విషయంలో తాను ముందు వరుసలో ఉన్నట్టు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, జలవనరుల శాఖా మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం పరమేశ్వర తన నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. 

కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే మంత్రి పదవులు త్యాగం చేయడానికి సిద్ధపడాలని ఈ సమావేశంలో పలువురు మంత్రులు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ముంబైలోని హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు పదిమంది కుమారస్వామి ఆఫర్‌ను తిరస్కరించారని చెబుతున్నారు. త్వరలోనే తామంతా బీజేపీలో చేరబోతున్నట్టు రెబల్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ చెబుతున్నారు. ఇక ఇదే మంచి సమాయం అనుకున్న సీఎం ఆశావహులు తమ తమ అభిమానుల చేత సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. 

అలా ప్రచారం జరుగుతున్న పేర్లలో డీకే శివ కుమార్, రామలింగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయ సంక్షోభం పార్లమెంటు ముందుకు వచ్చింది. కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ పార్టీ లోక్‌ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆ తీర్మానంలో పేర్కొంది.