కార్గిల్ యుద్ధం… కొండలపైన భారత సైన్యం కొండంత సాహసం!

 

జూలై 26… పద్దెనిమిది సంవత్సరాల క్రితం వరకూ దీనికి పెద్దగా ప్రాముఖ్యత లేదు! కాని, అప్పట్నుంచీ ఈ తేదీ అంటే దేశభక్తి వున్న భారతీయులందరికీ ఎంతో గర్వకారణం! అదే సమయంలో అమూల్యమైన 5వందల ప్రాణాలు కోల్పోయిన విషాదం కూడా! అటువంటి సగర్వ, విషాదాల సమ్మేళనమే కార్గిల్ దివస్! 1999 జూలై 26న మన అద్భుత సైనిక, వాయుసేన బలగాలు అసాధ్యం సుసాధ్యం చేసి చూపాయి! ఆకాశాన్నంటే కొండలపై నరాలు కొరికేసే చలిలో తమ సత్తాలోని సెగ ఏంటో పాకిస్తాన్ కు, అది ఉసిగొల్పి పంపిన ఉగ్రవాదులకు చవి చూపించాయి…

 

డెబ్బై ఏళ్ల భారత స్వతంత్ర చరిత్రలో యుద్ధాన్ని ఎదుర్కొన్న కాంగ్రేసేతర ప్రధాని కేవలం వాజ్ పేయ్ మాత్రమే. నెహ్రు కాలంలో, ఇందిర కాలంలో, లాల్ బహుదూర్ శాస్త్రీ కాలంలో మనం యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కాని, సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో వాజ్ పేయ్ ఒక్కరు మాత్రమే పాక్ పై యుద్ధం ప్రకటించి చేజారిన అత్యంత కీలకమైన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. అందుకు మన ఇండియన్ ఆర్మీ బుల్లెట్లు ఎదురు వెళ్లి వీరత్వాన్ని నిరూపించుకుంటూ, వీర స్వర్గాన్ని కాంక్షిస్తూ దేశ భద్రత చేపట్టింది. వాజ్ పేయ్ ఆప్యాయంగా ముషర్రఫ్ ని పిలిచి చర్చలు జరిపితే… ఆ ముష్కరుడు వెన్నుపోటుకు వ్యూహం పన్నాడు. తన మిలటరీ సాయంతో జిహాదీల్ని వేల అడుగుల ఎత్తులో వున్న కార్గిల్ ప్రాంతంలోకి ప్రవేశపెట్టాడు. అక్కడ తిష్టవేసిన టెర్రరిస్టులు దేశంపై యుద్దం ప్రకటించారు. అనివార్య పరిస్థితుల్లో ఆనాటి ప్రధాని సైనికులకి పచ్చ జెండా ఊపారు! ఆ తరువాత 60రోజుల్లో మన జవాన్లు పాకిస్తాన్, దాని ఉగ్రవాదుల మదం అణిచి కార్గిల్ తిరిగి స్వాధీనం చేసుకున్నారు…

 

కార్గిల్ విజయం జూలై 26 , 1999తో సంపూర్ణమైంది. అయితే, ఈ రెండు నెలల సుదీర్ఘ యుద్ధం అనేక విశేషాలకు సాక్షం కూడా అయింది. భారత సైనిక సత్తా ఏంటో పాకిస్తాన్ మరోమారు తెలిసి వచ్చింది. మన వారు 5వందల మంది ప్రాణత్యాగం చేస్తే పాక్ ఖాతాలో మరణాలు దాదాపు 3వేల వరకూ వుంటాయని ఆ దేశ మీడియానే చెప్పింది! అలాగే, వేల అడుగుల ఎత్తులో మన జవాన్ల మాదిరిగా యుద్ధం చేయటం అమెరికా, రష్యా లాంటి దేశాల సైనికులకి కూడా సాధ్యం కాదని స్పష్టమైంది. అందుకే, తరువాతి కాలంలో పర్వత ప్రాంతాల్లో యుద్ధం గురించి మన సైనికాధికారులు అమెరికన్ ఆర్మీకి శిక్షణ ఇచ్చారు. ఇక చరిత్రలో మొదటిసారి పూర్తి స్థాయిలో మన వాయుసేన భూమ్మీది సైన్యానికి మద్దతుగా నిలిచింది కార్గిల్ వార్ లో! కార్గిల్ యుద్ధం ఆ విధంగా మన ఎయిర్ ఫోర్స్ సత్తా కూడా ఋజువు చేసింది. మరో విషయం ఏంటంటే… పదే పదే అణు బాంబు వేస్తామనే పాక్ 60రోజులు యుద్ధం జరుగుతున్నా అంతర్జాతీయ ఒత్తిడితో అలాంటి దుస్సాహసం చేయలేకపోయింది. కాబట్టి న్యూక్లియర్ బెదిరింపులు మాటలు మాట్లాడినంత తేలిక కాదని ప్రూవ్ అయింది!

 

యుద్ధంలో మనం గెలిచి వుండవచ్చు. పాక్ , దాని ఉగ్రవాదులు ఓడి వుండవచ్చు. కాని, ప్రాణ నష్టం ఇరువైపులా జరిగింది. అది జరగకూడదనే మానవత్వమున్న ఎవరైనా కోరుకుంటారు. అయితే, పాక్, చైనా లాంటి దేశాలున్న భారత్ ఎల్లప్పుడూ యుద్ధం వద్దని చేతులు కట్టుకుంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే! అవసరమైతే కార్గిల్ విజయం లాంటి ధీటైన విజయాలు సాధించటానికి, దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించటానికి సర్వ సన్నద్ధంగా వుండాలి. మన కోసం ప్రాణాలు పణంగా పెట్టే ఆర్మీకి మనమూ, పాలకులు, ప్రతిపక్షాలు అందరూ అండగా నిలబడాలి. చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న ప్రస్తు తరుణంలో ఇది మరింత ముఖ్యం…