పీసీసీ బొత్సకు జేసీ కౌంటర్ అటాక్

 

 

 

కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్షీణదశకు వచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని ఆయన అన్నారు. ముందుగా పార్టీ నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను సస్పెండ్ చేయాలని, తర్వాత కేంద్ర, రాష్ట్ర నేతలను సస్పెండ్ చేయాలని, అనంతరం తనను సస్పెండ్ చేయాలని జేపీ వ్యాఖ్యానించారు.

 

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆరోగ్యం సరిగాలేదని, పార్టీలో మార్పు రావాలని, మంచి వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని కోరామని, ఇందులో ఏమైనా బూతులు ఉన్నాయా అంటూ జేసీ ప్రశ్నించారు. ప్రాంతీయ శక్తులు బలపడితే దేశానికి ప్రమాదమని, జాతీయ పార్టీలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీ బలోపేతానికి సూచనలు మాత్రమే చేశారని ఆయన పేర్కొన్నారు.



తాను సమైక్యవాదినని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, సమైక్యం వీలు కాకపోతే రాయల తెలంగాణ ఇవ్వాలని కోరానని జేసీ పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవి వదులుకోడానికి సిద్ధపడే సమైక్యవాదం వినిపిస్తున్నారని జేసీ పేర్కొన్నారు.