ఇ.డి. కేసుల్లో జగన్ ను ఢిల్లీకి తరలిస్తారా?
Published on: Sat Jun 2, 2012 10:41AM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసును ఢిల్లీకి మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మారిషస్, లగ్జెంబర్గ్, వర్జీన్ ఐలాండ్స్, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో జగన్ తన డబ్బు ఇచ్చి పలుకంపెనీల ద్వారా దేశంలోని తన కంపెనీలకు పెట్టుబడి పెట్టించారన్న అభియోగం నిర్థారించేందుకు తగిన ఆధారాలు లభించనున్న నేపథ్యంలో ఇ.డి. బృందం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. సిబీఐ సహకారంతో ఇ.డి.కి అవసరమైన ఆధారాల్లో కొన్ని లభించాయి. కోల్ కతా, ముంబైల్లోని కొన్ని సూట్ కేస్ కంపెనాల వివరాలను ఇ.డి. సేకరించింది. సిబీఐతో సమావేశమైన ఇ.డి. బృందం ఈ విచారణకు సాక్ష్యాలు సేకరిస్తుండటంతో డైరెక్టరేట్ స్థాయి అధికారితో మరో బృందం హైదరాబాద్ బయలుదేరిందని తెలిసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జగన్ కు కఠినశిక్ష తప్పదన్నట్లు ఇ.డి. వ్యవహారశైలి ఉంది. కొత్తబృందం వచ్చిన వెంటనే జగన్ ను వీలైనంత త్వరగా ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతాయని ఇ.డి. అధికారులు వివరించారు.


